కనీస వేతనాల గెజిట్‌‌‌‌ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్...ప్రభుత్వ రివ్యూ పిటిషన్లకు అనుమతి

కనీస వేతనాల గెజిట్‌‌‌‌ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్...ప్రభుత్వ రివ్యూ పిటిషన్లకు అనుమతి

హైదరాబాద్, వెలుగు: 2021 –-22 మధ్య కాలంలో కనీస వేతనాలను సవరిస్తూ జారీ చేసిన ఐదు ప్రభుత్వ ఉత్తర్వులను అధికారిక గెజిట్‌‌‌‌లో ప్రచురించాలంటూ 2024లో ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను అనుమతించిన కోర్టు.. ఆ ఉత్తర్వులను అమలు చేయలేదంటూ కార్మిక సంఘాలు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను మూసివేసింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. 1948 కనీస వేతనాల చట్టం స్థానంలో వేతనాల కోడ్–2019 గతేడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, 2024లో ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్న ప్రభుత్వ వాదనను కోర్టు సమర్థించింది. 

గతంలో గెజిట్‌‌‌‌ ప్రచురణకు ఆదేశాలు జారీ చేసినప్పుడు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన అంశాన్ని ప్రభుత్వం తమ దృష్టికి తీసుకురాలేదని కోర్టు పేర్కొంది. గెజిట్‌‌‌‌లో ప్రచురణ లేకుంటే నోటిఫికేషన్లను యజమానులు తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపింది. అయితే కనీస వేతనాల చట్టం రద్దై, దాని స్థానంలో వేతనాల కోడ్–2019 అమల్లోకి వచ్చినందున పూర్వ ఉత్తర్వులను తిరిగి పరిశీలించడం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.