నల్గొండ, వెలుగు: భూ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ నల్గొండ ఆర్డీవో ఆఫీస్‌లో పని చేసే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జి.పవన్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. భూ సర్వే రిపోర్ట్ కోసం ఓ వ్యక్తి డిప్యూటీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్‌ను ఆశ్రయించాడు. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి రూ.35 వేలు లంచం డిమాండ్ చేసి, గతంలో రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.
ఆ తరువాత బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు శుక్రవారం మిగిలిన రూ.15 వేలు కలెక్టరేట్ సమీపంలో ఇచ్చాడు. పవన్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్ లో సోదాలు నిర్వహించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
