హాలియా, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు లేక ప్రధాన జలాశయాలు నీటిలేమితో అల్లాడుతున్న నేపథ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 10న నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున విజయ్ విహార్ లో వరుణ యాగం నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
శనివారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డితో కలిసి విజయ్ విహార్ లో యాశాల, ప్రవచన శాల, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది అర్చకులు, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అర్చకుల బృందంతో ఈ నెల 10న ఉదయం 4 గంటలకు ఈ యాగం అట్టహాసంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదులలో నీటి మట్టాలు తగ్గి రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఆదివారం జరిగే ఈ యాగానికి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్నారని పేర్కొన్నారు.
భక్తులు యాగాన్ని తిలకించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన, భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సూర్యాపేట ఎస్పీ నరసింహ, నల్గొండ అదనపు ఎస్పీ రమేశ్, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం
నిర్వహించారు.
