- వనరుల వినియోగంపై దృష్టిపెట్టాలని ఆదేశం
- ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని సంపద సృష్టించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను, నిరుపయోగంగా ఉన్న ఆస్తులను పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) మోడల్‌లో అభివృద్ధి చేయడంతో పాటు, టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఆదాయ వనరుల సమీకరణపై శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్టారావు పాల్గొన్నారు.
పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై అధ్యయనం, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంపు, భారత్ సిరీస్ పన్నుల అంశంపై దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. పర్యాటక కేంద్రాల్లోని ప్రభుత్వ భూములు, స్థలాలను సమర్థవంతంగా వినియోగించి ఖజానాకు ఆదాయాన్ని తేవాలని సూచించారు. టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం రంగాల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలన్నారు. వారాంతాల్లో హెలీకాప్టర్ టూరిజాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. పీపీపీ ఆధారిత సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేబినెట్ ముందుంచాలని అధికారులను ఆదేశించారు.
కాగా, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా ఇసుకను ఎగుమతి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే, బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ భూముల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సమీకరణపైనా మంత్రులు సమీక్షించారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, శశాంక, అనుదీప్ దురిశెట్టి, కృష్ణ భాస్కర్, రాజీవ్ గాంధీ హనుమంతు, ఇలంబర్తి, ఎన్. శ్రీధర్, వాణి ప్రసాద్, నిఖిల్ చక్రవర్తి, కృష్ణ ఆదిత్య, వికాస్ రాజ్ పాల్గొన్నారు.
