- ఆపరేషన్లు చేసే డాక్టర్లకు మినహాయింపు ఇవ్వండి: గాంధీ, ఉస్మానియా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ప్రస్తుతం చేపడుతున్న డాక్టర్ల నియామకాలు కేవలం తాత్కాలికమేనని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటల్స్ నుంచి టిమ్స్‌కు వెళ్తున్న డాక్టర్లు కేవలం తాత్కాలిక సాయం (హెల్పింగ్ హ్యాండ్) కోసమేనని తెలిపారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ఏరోజు ప్రారంభించినా సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే డిప్యూటేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. టిమ్స్ అనేది స్వయంప్రతిపత్తి గల సంస్థ (అటనామస్ బాడీ) కాబట్టి, డీఎంఈ డాక్టర్లు అక్కడ శాశ్వతంగా కొనసాగే అవకాశం లేదని వివరించారు.
త్వరలోనే రెగ్యులర్ రిక్రూట్‌మెంట్
త్వరలోనే టిమ్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ద్వారా శాశ్వత పోస్టులను భర్తీ చేయనుందని డీఎంఈ నరేంద్ర కుమార్ వెల్లడించారు. కొత్త డాక్టర్లు రెగ్యులర్ పద్ధతిలో విధుల్లో చేరిన వెంటనే, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై వెళ్లిన డాక్టర్లందరూ తిరిగి తమ సొంత ఆసుపత్రులకు (పేరెంట్ హాస్పిటల్స్) వచ్చేస్తారని స్పష్టం చేశారు. అప్పటివరకు మాత్రమే ఈ వైద్యుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని వివరించారు. మరోవైపు, నిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ ఆమరేశ్ పేరు పొరపాటున ఈ జాబితాలోకి వచ్చిందని, విషయాన్ని గుర్తించిన వెంటనే ఆయన పేరును డిప్యూటేషన్ లిస్టు నుంచి తొలగించినట్లు డీఎంఈ కార్యాలయం స్పష్టం చేసింది.
అయితే, కీలకమైన సూపర్ స్పెషాలిటీ విభాగాల నుంపవ డాక్టర్లను డిప్యూటేషన్‌పై టిమ్స్‌కు పంపడం పట్ల గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన సర్జరీలు చేసే నిపుణులైన డాక్టర్లను పంపించడం వల్ల తమ ఆసుపత్రుల్లో రోగులకు అందించే వైద్య సేవలకు ఆటంకం కలుగుతుందని వారు డీఎంఈకి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కీలక ఆపరేషన్లు చేసే వైద్యుల విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో.. ఈ డిప్యూటేషన్ల అంశంపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
