పేపర్ లీకేజీలతో ఎందరో విద్యార్థుల భవితవ్యం రోడ్డున పడ్డ పరిస్థితుల్లో.. మరోసారి నీట్ పరీక్ష విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈసారైనా.. లీకేజీలకు, అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా నీట్ రీఎగ్జామ్ జరుగుతుందా అని విద్యార్థులు, పేరెంట్స్ భయాందోళనలో ఉన్న సమయంలో.. రీసెంట్ గా విడుదలైన హాల్ టికెట్ల విషయంలో NTA వ్యవహారంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. నాగ్ పూర్ విద్యా్ర్థికి అబూదబిలో సెంటర్ అలాట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
NEET 2026 రీఎగ్జామ్ జూన్ 21న అంటే రేపు ఆదివారం జరగనుంది. అయితే నాగ్‌పూర్‌కు చెందిన నీట్ అభ్యర్థి, ఎగ్జామ్ సెంటర్ ను ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద నాగ్‌పూర్‌ను ఎంచుకున్నాడు. కానీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో పరీక్షా కేంద్రం అలాట్ అయ్యింది. విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా, తమ లైఫ్ యాంబిషన్ గా తీసుకునే ఈ మెడికల్ ఎగ్జామ్ విషయంలో.. కేవలం ఒకే ఒక రోజు మిగిలి ఉండగా ఇలాంటి ఎగ్జామ్ సెంటర్ తప్పుగా పడటంతో విద్యార్థి తో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే ఇంతకు ముందు ఆ విద్యార్థికి ఎగ్జామ్ సెంటర్ నాగ్‌పూర్‌లోని సరస్వతి విద్యాలయంలో పండింది. అయితే, పేపర్ లీక్ వివాదంతో పరీక్షను వాయిదా పడటంతో మరోసారి కొత్త అడ్మిట్ కార్డు, కొత్త సెంటర్ కేటాయించారు. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోగా, పరీక్ష కేంద్రం యూఏఈలోని అబుదాబి ఇండియన్ స్కూల్ లో పడినట్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. తెలుసుకున్నాడు.
అప్లికేషన్ ఫాంలో నాగ్‌పూర్‌ను తన ఫస్ట్ ఆప్షన్ గా.. ఆ తర్వాత వార్ధా, భండారాలను రెండు మూడు ఆప్షన్లుగా ఎంచుకున్నాడు. కానీ ఈ మూడింటిలో ఏ ఒక్క సెంటర్ లో పడకుండా.. ఏకంగా విదేశాల్లో సెంటర్ పడటం గందరగోళాలనికి గురిచేస్తోంది.
మా కొడుకుకు పాస్ పోర్టు కూడాలేదు. పరీక్ష కోసం విదేశాలకు ఎలా పంపాలి. ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం కూడా లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి తండ్రి మహమ్మద్ తాలిబ్.
అయితే అడ్మిట్ కార్డు లోపాన్ని NTA హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. టెక్నికల్ సమస్య అని.. పొరపాటును అంగీకరించి మరో కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ పొరపాటుపై మహారాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ అనీస్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. ఇది పరీక్షల ఏజెన్సీ NTA చేసిన తీవ్రమైన తప్పిదమని విమర్శించారు. విద్యార్థికి నాగ్‌పూర్‌లో గానీ లేదా సమీప సిటీలో సెంటర్ ను కేటాయించి పొరపాటును సరిదిద్దాలని NTAని కోరారు.
ఏర్పాట్లు పూర్తి:
నీట్ (యూజీ) 2026 రీ -ఎగ్జామ్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపే (ఆదివారం) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్- పేపర్ మోడ్లో ఈ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. మొత్తం 22.79 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానుండగా, ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా సుమారు 2 లక్షల మంది సిబ్బందిని పరీక్షా విధుల్లో మోహరించారు.
ఇందులో 674 మంది సిటీ కో ఆర్డినేటర్లు, 6,669 మంది అబ్జర్వర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇన్విజిలేటర్లు పర్యవేక్షణ చేయనున్నారు. పరీక్షా సామగ్రి, రవాణా కోసం పోలీసు బలగాలు, ఎస్కార్ట్ టీమ్లో సాయం తీసుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచి 72 వేలకుపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ..
అభ్యర్థులు ఉదయం 11 నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, మధ్యాహ్నం 1:30కే గేట్లు మూసివేస్తారు. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఎన్టీఏ తేల్చిచెప్పింది. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీ, ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డ్, 2 పాస్ పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. పరీక్షకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఎన్టీఏ హెల్ప్ లైన్ నంబర్లకు 011--40759000 ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు.
