- ఆ క్యాంటీన్లలో రోజూ ఉప్మానేనా
- వానాకాలానికి ముందే డ్రైనేజీలు, నాలాలను ఎందుకు క్లీన్ చేయలే
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో మాన్సూన్ సీజన్ ఏర్పాట్లలో జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుపై హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మాన్సున్ ప్రిపరేషన్ తో పాటు పలు అంశాలపై జీహెచ్ఎంసీలో హెడ్ ఆఫీసులో రివ్యూనిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ సిటీలో ఎక్కడైనా స్ర్టీట్ లైట్లు వెలగకపోతే సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్నం లైట్లు వెలిగినా చర్యలు తప్పవన్నారు. అన్ని ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ ఎందుకు పెట్టడం లేదని, కొన్నిచోట్ల రెగ్యూలర్ గా ఉప్మానే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. వర్షాలు పడినప్పుడు అంతా హైడ్రా చూసుకుంటుందనే ధోరణి సరికాదని, మాన్సూన్‌కు ముందుగానే డ్రైనేజీలు, నాలాల క్లీనింగ్ పనులు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఖరి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నామన్నారు. సిటీలోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలని, సున్నా వడ్డీ రుణాలు ఉపయోగించుకోవాలన్నారు. అర్బన్ మహిళా సంఘాలకు సైతం ఆర్టీసీ అద్దె బస్సులు ,ఇందిరమ్మ క్యాంటీన్లు, ఫిష్ స్టాల్స్ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
