హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌లోని వివిధ శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్వోలు), సీనియర్ స్టెనోగ్రాఫర్లుగా పనిచేస్తున్న వారికి ఎంపీడీవోలు(మండల పరిషత్ అభివృద్ధి అధికారులు)గా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. బదిలీ ప్రాతిపదికన వీరిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సర్వీసెస్) బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ విజ్ఞప్తి మేరకు.. సెక్రటేరియెట్‌లోని ‘సింగిల్ యూనిట్’ పరిధిలోకి వచ్చే శాఖల్లో (ఆర్థిక, న్యాయ శాఖలు మినహా) పనిచేస్తున్న ఏఎస్వోలు, సీనియర్ స్టెనోల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపీడీవోలుగా వెళ్లడానికి ఆసక్తి ఉన్న వారు నిర్ణీత ప్రోఫార్మాలో తమ విల్లింగ్ను ఈ నెల 24 లోపు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులతోపాటు ఉద్యోగి వార్షిక పనితీరు నివేదికలు, ఐదేళ్ల స్పెషల్ అసెస్ మెంట్ నివేదికలను జత చేయాలని ప్రభుత్వం సూచించింది.
