భూ బాధితులకు న్యాయం చేస్తాం..ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చేందుకు కృషి

భూ బాధితులకు న్యాయం చేస్తాం..ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చేందుకు కృషి
  • వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి భరోసా... 
  • వీపనగండ్ల మండల రైతులు, గ్రామస్తులతో జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం
  • ఎకరానికి రూ.11.50 లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలని బాధితుల విన్నపం

వనపర్తి, వెలుగు :  వనపర్తి జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టుల భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందించి న్యాయం చేస్తామని  కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​ మీటింగ్​హాల్లో వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె రిజర్వాయర్ లింకు కెనాల్ నిర్మాణ భూసేకరణపై తూముకుంట, సంగినేనిపల్లి గ్రామ రైతులు, అధికారులతో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ లింకు కెనాల్ నిర్మాణం కోసం సేకరించాల్సిన 90 ఎకరాల భూములకు సంబంధించిన బాధితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను అధికారులకు తెలిపారు. 

మార్కెట్ ధరల ప్రకారం పరిహారమివ్వాలి..

పలువురు రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోయే వారంతా కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్న చిన్న, సన్నకారు రైతులని అధికారులకు వివరించారు. భూములు పోతే తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని, అందుకే ప్రభుత్వం నిర్దేశించిన ఎకరానికి రూ.11.50 లక్షల పరిహారం కాకుండా, మార్కెట్ ధరల ప్రకారం న్యాయమైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ముందుగా సింగోటం వైపు నుంచి భూసేకరణను ప్రారంభించి, ఆ తర్వాతే తమ వైపునకు రావాలని వారు అధికారులకు విన్నవించారు.

 న్యాయమైన ప్రక్రియ చేపడతాం.. 

కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తుందని, గతంలో వల్లభాపూర్, బొల్లారం గ్రామాల్లో జరిగిన భూసేకరణ తరహాలోనే ఇక్కడ కూడా న్యాయమైన ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. రైతుల విన్నపాన్ని వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.

 భూసేకరణ చట్టం ప్రకారం ఎంత పరిహారం ఇవ్వవచ్చనేది త్వరలోనే నిర్ణయించి, అధికారులు నేరుగా గ్రామానికి వచ్చి వివరాలు తెలియజేస్తారన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ వినోద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్​ శాఖ అధికారులు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇతర రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.