దేశంలో ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వినియోగంపై రాజకీయ, ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి పాదయాత్ర చేపట్టారు.
ఈ20 పెట్రోల్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేదా ఇథనాల్ కలిపిన ఇంధనంతో పాటు సాధారణ (స్వచ్ఛమైన) పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచి ఇంధన వినియోగదారులకు ప్రత్యామ్నాయం ఇవ్వాలని ఆప్ కోరుతోంది. ఈ మేరకు దాదాపు 2.33 లక్షల మంది మద్దతుదారులతో సంతకాలు సేకరించి వినతిపత్రం సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నివాసం చుట్టూ బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మార్చ్‌కు ఎలాంటి అనుమతి లేదంటూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు, ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతోందని, నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ టాక్సీ, టూర్ ఆపరేటర్ల సంఘాలు పార్లమెంట్ వైపు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
ఈ ప్రచారం ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, కేవలం వినియోగదారులకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలనేదే మా ప్రధాన డిమాండ్ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పాత వాహనాల యజమానులు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇథనాల్ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతి భారం తగ్గుతుందని, దేశీయ రైతులకు (చెరకు, మొక్కజొన్న పండించే వారికి) అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని సమర్థిస్తోంది. నిపుణుల కమిటీల పరీక్షల తర్వాతే దీన్ని తెచ్చామని, పాత వాహనాలపై దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతానికి 20 శాతానికి మించి పెంచే ఆలోచన లేదని ఈ మధ్యే పార్లమెంట్‌లో వెల్లడించింది.
