వామ్మో.. ఇవి మసాలాలేనా?.. ప్రాణం తీసే కెమికల్స్, కలర్స్ తో తయారీ..25టన్నుల నకిలీ మసాలా పట్టివేత

వామ్మో.. ఇవి మసాలాలేనా?.. ప్రాణం తీసే కెమికల్స్, కలర్స్ తో తయారీ..25టన్నుల నకిలీ మసాలా పట్టివేత

మనం ప్రతిరోజూ వంటల్లో ఉపయోగించే మసాలాలు అసలైనవే అనుకుంటే పొరపాటే. కల్తీకీ కాదేది అనర్హం అన్నట్టు ప్రతిదీ కల్తీ చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు కల్తీగాళ్లు. ఉప్పు, పప్పులు, పాలు,నెయ్యి ,వంట నూనెలు, కారం, పసుపు, మసాలా దినుసులు, సబ్బులు ఇలా ప్రజలు వాడే నిత్యావసర వస్తువులను  విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. ప్రాణాంతకమైన  కెమికల్స్, కలర్స్ తో తినే వస్తువులన్నింటిని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న కల్తీ ఫుడ్స్ పై నిఘా పెట్టిన H-FAST అధికారులు.. హైదరాబాద్‌లో  కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు బట్టబయలు చేశారు.

మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు నిజంగా సురక్షితమైనవేనా? ..హైదరాబాద్‌లో H-FAST అధికారులు నిర్వహించిన తాజా దాడుల్లో భయంకరమైన నిజాలు బయటికొచ్చాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠాలపై దాడులు నిర్వహించిన భారీ స్థాయిలో కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 

రంగు, వాసన, మెరుపు కోసం విషపూరిత కెమికల్స్, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్ కలిపి కల్తీ మసాలాలు తయారు చేస్తున్నారు. ఈ మసాలాలు తింటే క్యాన్సర్‌తో పాటు కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలను, 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.

అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి మసాలాల్లో ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి హానికర పదార్థాలు కలిపి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మసాలాలు తాజాగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకర కెమికల్స్ ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. తప్పుడు బ్రాండింగ్, నకిలీ లేబుళ్లతో వీటిని మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇలాంటి కల్తీ మసాలాలను నిరంతరం వాడితే కాలేయం, మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సంబంధిత వ్యాధులు, అలర్జీలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న శాంపిల్స్ ను  ల్యాబ్ కు పంపించారు. ఆహార భద్రత చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

గత నాలుగు నెలలుగా H-FAST  అధికారులు సిటీలోని కల్తీ ముఠాలపై దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు 659 దాడులు నిర్వహించి 202 కేసులు నమోదు చేశారు. 246 టన్నులకు పైగా కల్తీ ఫుడ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

రోజురోజుకు కల్తీ పదార్థాలు పెరిగిపోతున్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు సూచిస్తున్నారు. తినే పదార్థాలు కొనేటప్పుడు క్వాలిటీ, బ్రాండ్, ప్యాకింగ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానం వస్తే వెంటనే H-FAST హెల్ప్‌లైన్ 8712661212కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.