- జామ్‌నగర్‌లో సావరిన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్
- దీనికోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్
- శాటిలైట్ నెట్ సేవలు కూడాఏజీఎంలో అంబానీ వెల్లడి
జియోతో టెలికం రంగంలో విప్లవం సృష్టించిన రిలయన్స్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనూ సంచలనం సృష్టించాలని సిద్దమవుతోంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ ధరలను తగ్గించి సామాన్యులకు సైతం తక్కువ ధరతో ఐఏ సేవలు, శాటిలైట్ నెట్ సేవలు అందించాలని గుజరాత్ లోని జామ్ నగర్ లో ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించి సావరిన్ ఏఐ క్లౌడ్ ను ఏర్పాటు చేస్తోంది.ఇది అందుబాటులోకివస్తే ప్రతి ఒక్కరికి ఏఐ సేవలు చౌకగా లభించనున్నాయి.
ముంబై: అన్ని రంగాలకూ కీలకంగా మారిన ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీలో పెద్ద ఎత్తున విస్తరిస్తామని రిలయన్స్ ప్రకటించింది. టెలికం రంగంలో జియో విప్లవం సృష్టించినట్లుగానే, ఏఐ రంగంలోనూ సంచలనం సృష్టించాలని కోరుకుంటోంది. తన ఏఐ వ్యూహంతో దేశవ్యాప్తంగా డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించి, ఈ టెక్నాలజీ వాడకంలో మనదేశాన్ని మొదటి వరుసలో నిలుపుతామని ప్రకటించింది. వర్చువల్ పద్ధతిలో శుక్రవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ ధరలను తగ్గించి, సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
గుజరాత్ జామ్ నగర్‌లో సొంత ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించి సావరిన్ ఏఐ క్లౌడ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘అత్యాధునిక ఎన్విడియా జీపీయూలతో కూడిన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచి, దేశీయ సంస్థలకు ఏఐ సేవలు అందిస్తాం. జియో భారత్ఐక్యూ, ఏఐ వ్యాపార్, జియోహెల్త్ఐక్యూ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలలో ఏఐ సేవలు అందుబాటులోకి వస్తాయి. 22 భారతీయ భాషల్లో ఏఐ సేవలను అభివృద్ధి చేస్తాం. మై జియో యాప్‌ను వ్యక్తిగత ఏఐ ఏజెంట్‌గా మార్చుతాం. టెలికం, ఏఐ, శాటిలైట్ కనెక్టివిటీ, తయారీ రంగం, రిటైల్ వ్యాపారాల్లో కంపెనీ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థను మార్చుతాయి” అని ఆయన ప్రకటించారు.
చౌకగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు
రిలయన్స్ రిటైల్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ద్వారా తయారీ రంగాన్ని భారీగా విస్తరించనున్నారు. పానీయాలు, నిత్యావసరాలు, పండ్ల తయారీలో అధునాతన పద్ధతులు అమలు చేస్తారు. వ్యర్థాలను తగ్గించడం, నాణ్యతను పెంచడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తయారీలో నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. స్మార్ట్ డివైజెస్ నుంచి టెలివిజన్ల వరకు అన్నీ తక్కువ ధరలకే వినియోగదారులకు అందనున్నాయి.
గ్రీన్ ఎనర్జీతో 2 లక్షల ఉద్యోగాలు
అనంత్ అంబానీ నాయకత్వంలో గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 2 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నారు. కచ్ సోలార్ ఫామ్‌ను 5.5 లక్షల ఎకరాల్లో నిర్మిస్తారు. ఇది భారతదేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో 3 శాతం తీర్చుతుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా 120 గిగావాట్ అవర్స్ సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను తయారు చేస్తారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారీ పెట్టుబడులు పెడుతున్నారు. గ్రీన్ అమ్మోనియా సరఫరా కోసం శామ్సంగ్ సీ అండ్ టీతో 15 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.
వారసులు వస్తున్నారు
రిలయన్స్ జియో తదుపరి దశ బాధ్యతలను ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ నిర్వహించనున్నారు. కంపెనీ అభివృద్ధిలో తదుపరి నాయకత్వ బాధ్యతలను ఈ ముగ్గురు పంచుకోబోతున్నారు. యువత ఆలోచనలతో టెలికాం, డిజిటల్ సేవలను మరింత వేగంగా విస్తరించడానికి ఈ మార్పు దోహదపడుతుందని ముకేశ్అంబానీ అన్నారు. రిలయన్స్ వృద్ధి ప్రయాణంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని వివరించారు.
జియో హాట్‌స్టార్‌లో కంటెంట్ కామర్స్
జియో హాట్‌స్టార్‌లో కంటెంట్ కామర్స్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. యాప్‌లోనే మార్కెట్ ప్లేస్ ఉంటుంది. వినియోగదారులు వీడియో చూస్తూనే వస్తువులు కొనుక్కోవచ్చు. వినోదం, వాణిజ్యం ఒకే చోట ఉండటం వల్ల ప్రేక్షకులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా రిలయన్స్ స్ట్రీమింగ్ రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. డిజిటల్ వాణిజ్యంలో కొత్త అవకాశాలను సృష్టించడం ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని కంపెనీ తెలిపింది.
జియో ఐపీఓ.. ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ కోసం దరఖాస్తు చేసింది. దీని విలువ సుమారు రూ. 31,900 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ కానుంది. ఈ నిధులను ప్రధానంగా టెలికం విభాగం అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తారు. కంపెనీ విలువ దాదాపు రూ. 11 లక్షల కోట్లుగా అంచనా వేశారు. జియో ప్లాట్‌ఫామ్స్ టెలికాం వ్యాపారంతో పాటు ఏఐ, క్లౌడ్ సేవలను అందిస్తోంది. గూగుల్, మెటా వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఇందులో భాగస్వాములు.
ఈ ఏడాది మార్చి నాటికి జియోకు 52.44 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ రూ. 1.30 లక్షల కోట్ల ఆదాయం, రూ. 26,700 కోట్ల లాభం ఆర్జించింది. 5జీ నెట్వర్క్ విస్తరణ, బ్రాడ్‌బ్యాండ్ సేవల మెరుగుదల లక్ష్యంగా ఈ ఐపీఓను తీసుకువస్తున్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా రికార్డును జియో ఐపీఓ అధిగమించనుంది. భూమిపై కనెక్టివిటీ అందించిన జియో, ఇక నుంచి ఆకాశం నుంచి సేవలు అందించడానికి సిద్ధమైంది. స్టార్ లింక్ మాదిరే లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ నెట్వర్క్ ఏర్పాటు చేయనుంది.
