సెప్టెంబరు కల్లా లక్ష ఇండ్లు పూర్తి చేయాలి : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

సెప్టెంబరు కల్లా లక్ష ఇండ్లు పూర్తి చేయాలి : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్
  •     క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించండి: హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే సెప్టెంబర్ నాటికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో లక్ష ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని  అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఇండ్లన్నీ నిర్ణీత గడువులో పూర్తయ్యేలా పనిచేయాలని సూచించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్​ కల్లా లక్ష ఇండ్ల గృహప్రవేశాలు జరిగేలా కృషి చేయాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, డీఈలు, ఈఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈలు గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులను కలవాలని, ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 

అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో గ్రామ సమాఖ్యలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అర్హుల వివరాలను పూర్తిగా, పారదర్శకంగా నమోదు చేయాలని తెలిపారు. ఇంటి నిర్మాణాల కోసం లబ్ధిదారులు అవసరానికి మించి ఖర్చు పెట్టి ఇబ్బందులు పడకుండా వారికి సరైన సూచనలు ఇవ్వాలని అన్నారు. ఎక్కువ ఇండ్లు ఉన్న కాలనీల్లోనే గృహనిర్మాణ శాఖ ఏఈల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గ్రామాల్లో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలను సమగ్రంగా సేకరించాలని అధికారులకు సూచించారు.