టెలిగ్రామ్‌‌‌‌ పై కేంద్రం నిషేధం సబబే..బ్యాన్ ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

టెలిగ్రామ్‌‌‌‌ పై కేంద్రం నిషేధం సబబే..బ్యాన్ ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: నీట్-యూజీ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌‌‌‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆదివారం (ఈ నెల 21న) జరగనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్‌‌‌‌కు ముందు పేపర్ లీకేజీకి సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు.. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్‌‌‌‌ఫాంను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. 

అలాగే, ఈ నెల 30 వరకు ఈ యాప్‌‌‌‌లోని మెసేజ్-ఎడిటింగ్ ఫీచర్‌‌‌‌ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించగా, దానికి కూడా కోర్టు ఆమోదం తెలిపింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్లాట్‌‌‌‌ఫాం యాక్సెస్‌‌‌‌ను పరిమితం చేయడానికి ఐటీ యాక్ట్​లోని సెక్షన్ 69ఎ కింద అనుసరించిన విధానం సంతృప్తికరంగా ఉందని జస్టిస్ తేజస్ కారియా పేర్కొన్నారు. కారణాలను స్పష్టంగా పేర్కొనలేదనే నెపంతో దాఖలైన సవాలును బెంచ్ తిరస్కరించింది. 

ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఎ కింద ఒక ప్లాట్‌‌‌‌ఫాంను పూర్తిగా బ్లాక్ చేసే అధికారం కేంద్రానికి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత అవసరమైన చర్య అని కోర్టు పేర్కొంది. ఈ నిషేధం కేవలం తాత్కాలికం మాత్రమేనని, నిర్దిష్ట లక్ష్యం కోసమే దీన్ని అమలు చేస్తున్నారని గుర్తుచేసింది. ఈ తీర్పుపై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ కూడా దీనిపై స్పందిస్తూ.. కేంద్రం తీసుకున్న ఈ చర్య పరీక్ష పత్రాలను లీక్ చేసిన ఇన్‌‌‌‌సైడర్లను కాకుండా, భారతదేశంలోని 15 కోట్ల మంది సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులను శిక్షించినట్టు అవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.