- ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ అందుకున్న డీజీపీ సీవీ ఆనంద్
న్యూఢిల్లీ, వెలుగు: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నందుకుగాను తెలంగాణ పోలీసు శాఖకు ప్రతిష్టాత్మక “ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్” లభించింది. ఈ పురస్కారాన్ని శుక్రవారం ఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ వేడుకల్లో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అందుకున్నారు. రాష్ట్రపోలీసులు సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌తో కేవలం 5 నుంచి 7 రోజుల్లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 8,67,741 దరఖాస్తుల్లో 99 శాతం (8,67,452) దరఖాస్తులను విజయవంతంగా ధ్రువీకరించారు.
అంతకుముందు ఏడాది కూడా 8 లక్షలకు పైగా దరఖాస్తులను వారం లోపే పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయం, సాంకేతికత వల్లే ఇది సాధ్యమైందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ విజయంలో పోలీసులు సొంతంగా అభివృద్ధి చేసిన ‘వెరిఫాస్ట్’ సాఫ్ట్‌వేర్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డేటా మ్యాచింగ్ ఆధారంగా పనిచేసే వెరిఫాస్ట్ వ్యవస్థ ద్వారా నకిలీ దరఖాస్తులను, నేర చరిత్రను వేగంగా గుర్తిస్తున్నారు. 2014లో సీవీ ఆనంద్ నేతృత్వంలో రూపొంది, 2015 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘వెరిఫాస్ట్’ విధానానికిగాను రాష్ట్ర పోలీసు శాఖ 2015 నుంచి ఇప్పటివరకు ఏకంగా ఏడోసారి జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకోవడం విశేషం.
