- వెహికల్స్ కంటే నడిచేవారికే తొలి ప్రాధాన్యం
- రహదారి ఉంటే ఫుట్‌పాత్ నిర్మించాల్సిందే.. అది అధికారుల బాధ్యత
- రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
- కేసులో చరిత్రాత్మక జడ్జిమెంట్
- బాధిత తండ్రికి ఇచ్చే పరిహారాన్ని రూ.11,44,628కు పెంపు
న్యూఢిల్లీ:దేశంలో నానాటికీ పెరిగిపోతున్న వాహన కాలుష్యం, ట్రాఫిక్ జంజాటాల నడుమ పాదచారుల భద్రతపై సుప్రీంకోర్టు అత్యంత కీలక, చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. రహదారుల వెంట నిర్దేశిత ఫుట్‌పాత్‌లపై నడవడం పౌరుల ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. మోటారు వాహనాల రాకపోకల కంటే నడిచే వారి హక్కులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు తేల్చిచెప్పింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డీ) ప్రకారం దేశవ్యాప్తంగా పౌరులు స్వేచ్ఛగా తిరిగే హక్కును కల్పించారని, ఇందులో నడిచే హక్కు కూడా భాగమేనని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. దీనిని జీవించే హక్కును ప్రసాదించే ఆర్టికల్ 21తో పాటు ఆర్టికల్ 19(1)(ఏ), (బీ), (సీ)తో కలిపి చదవాలని ధర్మాసనం తెలిపింది. ‘‘ఎక్కడైనా ఒక రహదారి ఉందంటే.. అక్కడ కచ్చితంగా పాదచారుల కోసం ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేసి, దానిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఇది కేవలం సూచన కాదు, కచ్చితంగా అమలు చేయాల్సిన విధి” అని స్పష్టం చేసింది.
కన్నీళ్లు పెట్టించిన ప్రమాదం.. కదిలిన న్యాయస్థానం
ఒక ఐదేండ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాద పరిహారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేండ్ల క్రితం ఒక తండ్రి తన ఐదేండ్ల కుమారుడిని ఉదయం 9 గంటలకు పాఠశాలకు తీసుకువెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఒక ట్యాంకర్ లారీ ఆ చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బాలుడి నడుము, కింది భాగం నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ప్రాంతంలో పాదచారులు నడవడానికి ఎలాంటి ఫుట్‌పాత్‌గానీ, రోడ్డు దాటడానికి పెడెస్ట్రియన్ క్రాసింగ్ గానీ లేకపోవడమే ఈ ఘోరానికి కారణమని తేలింది. ఈ కేసులో గతంలో హైకోర్టు తగ్గించిన నష్టపరిహారాన్ని సుప్రీంకోర్టు తప్పుబడుతూ.. బాధిత తండ్రికి ఇచ్చే పరిహారాన్ని రూ. 11,44,628 కు పెంచింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు!
నగరాలు, పట్టణాల ప్రణాళికలు కేవలం వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకునే జరుగుతున్నాయని, దీనివల్ల పాదచారులు తీవ్ర ప్రమాదంలో పడుతున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. చక్రం కనుగొనడానికంటే ముందే మానవుడు నడవడం నేర్చుకున్నాడు, కాబట్టి నడిచే హక్కుకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేసింది.
ఫుట్‌పాత్‌లు లేకపోవడం వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే.. బాధ్యులైన అధికారులపై, సంబంధిత ప్రభుత్వ విభాగాలపై పౌరులు కోర్టులను ఆశ్రయించి నష్టపరిహారం, న్యాయం పొందవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం-1988 కింద లభించే పరిహారంతో సంబంధం లేకుండా, రాజ్యాంగపరమైన నివారణోపాయాల ద్వారా ఈ నష్టపరిహారాన్ని డిమాండ్ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
