వీఓఏల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం : పంచాయతీరాజ్ మంత్రి సీతక్క

వీఓఏల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం : పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
  •     త్వరలోనే ఐడీ కార్డులు, యూనిఫాం చీరలు, ట్యాబ్‌‌‌‌ల పంపిణీ
  •     పంచాయతీరాజ్ మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏల) సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె వీఓఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఓ నెం.58 ప్రకారం రాష్ట్రంలోని 17,609 గ్రామ సంస్థల వీఓఏలకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. 

మహిళా సమాఖ్యల ఆర్థిక స్వావలంబనకు బ్యాంక్ లింకేజ్ రుణాలపై 0.3 శాతం కమిషన్ ఇస్తున్నామని, దీని ద్వారా ఏటా రూ.52 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోందన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల మార్కెటింగ్ కమిషన్‌‌‌‌లో 90 శాతం వాటాను గ్రామ సంస్థలకే కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రామ సంస్థల ఆదాయాన్ని బట్టి వీఓఏలకు నెలకు గరిష్టంగా రూ.25 వేల వరకు అదనపు గౌరవ వేతనం చెల్లించేలా మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. త్వరలోనే వీఓఏలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, యూనిఫాం చీరలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

అంగన్వాడీ -కమ్ -పాలన కేంద్రం ప్రారంభం

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రక్షాపురం, అరుంధతి నగర్‌‌‌‌లో ‘పాలన అంగన్‌‌‌‌వాడీ కమ్ క్రెచ్’  కేంద్రాలను మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. ఎస్బీఐ ఫౌండేషన్ మద్దతు, మొబైల్ క్రెచెస్ సంస్థ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు  చేసిటన్లు పేర్కొన్నారు. సీతక్క మాట్లాడుతూ..  పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌గా ఏర్పాటైన ఈ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన డే కేర్, పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ సేవలు అందుతాయని తెలిపారు. పిల్లల సంరక్షణ బాధ్యతల వల్ల మహిళలు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకే ఈ కేంద్రాలను తెచ్చామన్నారు. హైదరాబాద్ జిల్లాలో బల్కంపేట్, ఆరోగ్యనగర్, చిలకలగూడ, ఏసీఎస్ నగర్, అరుంధతి నగర్- 2 సహా మొత్తం 5 కేంద్రాలను రెండేళ్ల ప్రాతిపదికన నిర్వహించనున్నారు.