ప్రజా సమస్యలే జనసేన అజెండా: పవన్ కళ్యాణ్

ప్రజా సమస్యలే జనసేన అజెండా: పవన్ కళ్యాణ్
  • తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పనిచేద్దాం: పవన్ కల్యాణ్
  • రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహించండి  
  • పార్టీ నేతలకు జనసేన చీఫ్ దిశానిర్దేశం 
  • హైదరాబాద్‌‌లో తెలంగాణ జనసేన ఆఫీస్ ప్రారంభం  

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ నేల, పోరాటం, త్యాగాలు అన్నీ తనకు స్ఫూర్తినిచ్చాయని.. తాను తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న వ్యక్తినని జనసేన ప్రెసిడెంట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో కులరహితంగా యువత సాగించే హక్కుల పోరాటాలు ఎంతో విలువైనవని, ఇది పోరాటాల నేల.. ధన్యభూమి అని,  తెలంగాణ గడ్డ నుంచే జనసేన ప్రస్థానం మొదలైందన్నారు. శుక్రవారం మణికొండలో తెలంగాణ జనసేన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించారు. తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన భావజాలంతో తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని ఆయన వెల్లడించారు.

ప్రజా సమస్యలే జనసేన అజెండా అని ప్రకటించారు.  ‘‘రాజకీయాల్లో ప్రజల సమస్యలు వినే ఓపిక అవసరం. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి మన దగ్గరకు వస్తున్నారంటే వారిని మొదట గౌరవించాలి. వారి సమస్యలను సావధానంగా వినాలి. పరిష్కారాన్ని కనుగొనాలి. తెలంగాణలోనూ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయండి. అన్ని ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను వినండి. మన దగ్గరకు వచ్చే వారి సమస్యలను పరిష్కరించేలా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లండి. అప్పటికీ పరిష్కారం కాకుంటే ప్రజా ఉద్యమాలను ఎలా చేయాలో ఆలోచిద్దాం. మొదట ప్రజల సమస్యలను పూర్తిగా వినేందుకు ఓ వేదికను సిద్ధం చేయండి. అన్ని ప్రాంతాల్లోనూ ఇది బలంగా పనిచేసేలా చూడండి” అని పార్టీ తెలంగాణ నేతలకు పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు శుక్రవారం పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో తెలంగాణ నేతలు శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి, మహేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.