- ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలు కాజేసిన యువకుడు
టేక్మాల్, వెలుగు: ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడీతో ఇద్దరు యువతులను పరిచయం చేసుకొని ప్రేమ, పెండ్లి పేరుతో నమ్మించి వారి నుంచి లక్షలాది రూపాయలు, బంగారాన్ని కాజేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన యువతి కొండి స్వాతికి ఏడాది కింద ఇన్‌స్టాగ్రామ్‌లో రిత్విక్ రెడ్డి అనే ఐడీ నుంచి ఫాలో రిక్వెస్ట్ వచ్చింది. ఆమె దానిని యాక్సెప్ట్ చేయడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఐపీఎస్ ట్రైనింగ్ కోసం ఛత్తీస్ గఢ్ వెళ్తున్నానని, ట్రైనింగ్ పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, తన స్నేహితుడైన ఉప్పరి దుర్గేశ్‌కు డబ్బులు ఇవ్వాలని స్వాతిని రిక్వెస్ట్ చేశాడు. అతని మాటలు నిజమని నమ్మిన ఆమె విడతల వారీగా నగదు, ఫోన్ పే ద్వారా రూ.5 లక్షలు, తులం బంగారు చెవి కమ్మలను దుర్గేశ్ కు అందజేసింది.
ఆ తరువాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి రిప్లై లేకపోవడం, ఏడాది దాటినా అతను రాకపోవడంతో అనుమానం వచ్చిన స్వాతి తాను మోసపోయానని గ్రహించింది. ఇదే తరహాలో టేక్మాల్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతికి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో సాత్విక్ రెడ్డి అనే నకిలీ ఐడీ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాను ఏంబీబీఎస్ స్టూడెంట్ అని పరిచయం చేసుకున్న నిందితుడు డైమండ్ రింగ్ పంపిస్తున్నానని, దానికి టాక్స్ కట్టాలంటూ నమ్మించాడు.
తన స్నేహితుడు దుర్గేశ్ వస్తాడని చెప్పి, ఆమె వద్ద నుంచి విడతల వారీగా రూ.7 లక్షల నగదు, తులం బంగారు ఉంగరాన్ని కాజేశాడు. తమ గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేశ్ నకిలీ ఐడీతో తనను మోసం చేశాడని స్వాతి గుర్తించింది. అతడే ఇన్‌స్టాగ్రామ్‌లో రిత్విక్ రెడ్డి, సాత్విక్ రెడ్డి పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దుర్గేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్సై అరవింద్ తెలిపారు.
