నాగర్‌కర్నూల్, వెలుగు : కృష్ణా పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో కృష్ణా బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంభించి ప్రతి రోజు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. కేఎల్ఐ లోని ఎల్లూరు పంప్‌హౌజ్ లో మొదటి పంప్స్టార్ట్చేసిన ఇంజినీరింగ్ ఆఫీసర్లు ఎల్లూరు రిజర్వాయర్‌నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తున్నారు.
దీంతో జిల్లాలో 4.50 లక్షల ఎకరాల పంటల సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. కానీ కేఎల్ఐ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరందించేందుకు నాలుగు రిజర్వాయర్లతో పాటు దాదాపు 800పైగా పెద్ద చెరువులు నింపాల్సి ఉంటుంది.
కృష్ణా నదికి వరద మొదలైన వారం తర్వాత ఎల్లూరు మొదటి పంపును ప్రారంభించి రోజు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్చేస్తున్నారు.
తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో కేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరందించేందుకు అవకాశాలున్నా.. అధికారులు రెండో పంప్ వినియోగంపై స్పందించడం లేదు. ఎల్లూరులో రెండు పంపుల ద్వారా 1600 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తే తప్ప కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి ఉండదు.
శ్రీశైలం రిజర్వాయర్ లో 850 అడుగుల వద్దకు నీరు చేరగానే ఏపీ వైపు పోతిరెడ్డిపాడు ఇతర ప్రాజెక్టులకు నీరు వదులుతున్నా.. తెలంగాణ వైపున్న కేఎల్ఐ వంటి మేజర్ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు నింపడంపై అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఇంజినీరింగ్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
