- కేసీఆర్‌ను అడుగుదామంటే అసెంబ్లీకి వస్తలేడు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
చిన్నచింతకుంట/మదనాపురం, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్ పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతుల గోసకు కారణమయ్యారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డిలతో కలిసి పర్యటించారు.
దేవరకద్ర మండలం మీనుగోనిపల్లిలో రూ.158.36 కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రోడ్డు పనులకు, ఊకచెట్టు వాగుపై రూ.40 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఊకచెట్టు వాగుపై రూ.6 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. కురుమూర్తి క్షేత్రం చేరుకొని ఘాట్ రోడ్డు పనులపై ఆఫీసర్లతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సంపదను దోచుకొని ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. కేటీఆర్ తండ్రి చాటు నాయకుడని, ఆయన ప్రభుత్వం గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరు చెప్పుకొని రేవంత్‌రెడ్డి సీఎం కాలేదన్నారు.
జూరాల, నెట్టంపాడు ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, నాడు కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నేడు రైతులకు ఇంత గోస ఉండేది కాదన్నారు.
అసెంబ్లీలో ఈ విషయాలు అడుగుతామనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. పాలమూరు లిఫ్ట్‌లో భాగమైన ఉదండాపూర్ భూసేకరణ కోసం కలెక్టర్ ఖాతాలో రూ.560 కోట్లు జమ చేశామని, త్వరలో కర్వెన రిజర్వాయర్‌ను నీటితో నింపుతామని తెలిపారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు నీటిని ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ సాయి శివాని పాల్గొన్నారు.
