నారాయణ పేట్ జిల్లాలో క్లాస్రూమ్లో  విద్యార్థిని కాటేసిన పాము.

నారాయణ పేట్ జిల్లాలో  క్లాస్రూమ్లో  విద్యార్థిని కాటేసిన పాము.
  •     ఎక్లాస్ పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి స్టూడెంట్​మృతి 

నారాయణపేట, వెలుగు:   క్లాస్​రూమ్​లో ఉన్న విద్యార్థిని పాము కాటేయడంతో ఆ స్టూడెంట్​ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్ పూ ర్ గ్రామంలో గురువారం జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల సంగీత, గుండప్ప దంపతులకుముగ్గురు కుమారులు.

రెండో కుమారుడు పిచ్చకుంట్ల రంజిత్ కుమార్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కాగా, గురువారం క్లాస్​లో కిటికీ పక్కన కూర్చుని ఉన్న రంజిత్​ను బయట నుంచి వచ్చిన పాము​ కాటేసింది. దీన్ని గమనించిన టీచర్లు వెంటనే బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే విద్యార్థి చనిపోయాడు.  ప్రభుత్వ పాఠశాల చుట్టూ శుభ్రత లేకపోవడంతోనే పాములు దూరుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. 


పెండ్లి చేస్తలేరని యువకుడు ఆత్మహత్య

కొల్చారం, వెలుగు :  పెండ్లి చేస్తలేరని మనస్తాపం చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్​ జిల్లా కొల్చారం మండలం రంగంపేట లో గురువారం జరిగింది. మృతుడి అన్న లక్ష్మీనారాయణ, కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేటకు చెందిన వేముల లింగం చిన్న కుమారుడు కుమార్(29) అలియాస్ పంతులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వంట మాస్టర్ గా పని చేసేవాడు. మద్యానికి బానిస అయినా కుమార్  కొన్ని రోజులుగా పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మనస్తాపం చెంది గురువారం తెల్లవారుజామున ఇంట్లో సీలింగ్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.