కందనూలు, వెలుగు : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తులను నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ గురువారం బిజినేపల్లి పీఎస్ లో వెల్లడించారు.
బిజినేపల్లి మండలంలోని మంగనూరుకు చెందిన నవీన్ గౌడ్, కురుమూర్తి ఈ నెల 1న గ్రామంలోని వైన్స్ కు వెళ్లి రూ. 500 నోట్లు ఇచ్చి బీర్లు కొనుగోలు చేశారు. వైన్స్ సిబ్బంది నోట్లను పరిశీలించగా అవి నకిలీవని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఏపీలో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నవీన్ గౌడ్, కురుమూర్తితో పాటు ఏపీకి చెందిన మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి రూ. 68 వేల నకిలీ కరెన్సీ, ఒక ప్రింటర్, కౌంటింగ్ మెషీన్, ఏడు సెల్ ఫోన్లు, పేపర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై శంషొద్దీన్, రమేశ్, శివ, భీముడు, ప్రవీణ్ పాల్గొన్నారు.
