ఈ 3 డిమాండ్లకు ఒకే అంటే... డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.?

ఈ 3 డిమాండ్లకు ఒకే అంటే...  డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.?

దేశ రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్ ) బిల్లుపై తమిళనాడులోని  డీఎంకే  కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించబోయే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు తెలిపేందుకు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పార్టీ కొన్ని షరతులు లేదా డిమాండ్లను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. 

 డీఎంకే మూడు ప్రధాన డిమాండ్లు ఇవే...

నియోజకవర్గాల సీట్ల సంఖ్యపై గడువు పెంపు 

రాబోయే 25 సంవత్సరాల పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలు కాకుండా 1971 జనాభా లెక్కలే ప్రాతిపదికగా ఉండాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. (1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్ల సంఖ్యపై ఉన్న రాజ్యాంగపరమైన ఫ్రీజ్  కాలపరిమితిని, రాబోయే సెన్సస్ తర్వాత కూడా మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని డీఎంకే కోరుతోంది) దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆ పార్టీ భావిస్తోంది. డీఎంకేకు 22 మంది  లోక్‌సభ సభ్యులు , రాజ్యసభలో 8 మంది   సభ్యులు ఉన్నారు,
 
అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెంపు

 కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో వెల్లడించినట్లుగా, అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తోంది.  

స్పష్టమైన షెడ్యూల్

ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉంటాయో చూపే రాష్ట్రాల వారీ జాబితాను బిల్లులో చేర్చాలని డీఎంకే కోరుతోంది.


దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, రాజకీయ ప్రాతినిధ్యానికి ఎలాంటి భంగం కలగకుండా ఈ మార్పులు చేస్తేనే బిల్లును పరిశీలిస్తామని డీఎంకే స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఈ డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, పార్లమెంట్‌లో సంఖ్యాబల సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మరి దీనిపై మోదీ సర్కార్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.