నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే బండ్ల

నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే బండ్ల
  •     గద్వాల కలెక్టర్ రిజ్వాన్​, ఎమ్మెల్యే బండ్ల


గద్వాల, వెలుగు: పునరావాస గ్రామాలలోని నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ ఆఫీస్ లోనే కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్ అండ్ ఆర్ కేంద్రాలలో సదుపాయాలపై కలెక్టర్ ఎమ్మెల్యే సంబంధిత ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ర్యాలంపాడు, చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి ఆర్ అండ్ ఆర్ సెంటర్ల లో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ర్యాలం పాడు ఆర్ అండ్ ఆర్  సెంటర్లో ఇండ్ల నిర్మాణానికి ఇంకా 5 ఎకరాలు భూమిని సేకరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గద్వాలలోని బ్రహ్మకుమారి పీస్ పార్క్ వద్ద జరిగిన వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమ ప్రారంభోత్సవంలో కలెక్టర్ పాల్గొని, సామాజిక సేవలో బ్రహ్మకుమారిల పాత్రను కొనియాడుతూ యువత వ్యసనాలకు బానిసలు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 పంట చేతికొచ్చే వరకు నీరు ఇవ్వాలి

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో, జూరాల కుడి కాలువ పరిధిలో వరి సాగు చేస్తున్న ఆయకట్టు రైతులకు పంట చేతికొచ్చే వరకు నీటిని ఇస్తామని ఇరిగేషన్ అధికారులు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. కలెక్టర్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ కేశవరావు స్పందిస్తూ  రైతులు వరి సాగు చేసే విషయంలో నీటి లభ్యత ఆధారంగా కాలువలకు నీటిని విడుదల చేస్తామని, ఇదే అంశాన్ని రాష్ట్ర ఇరిగేషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. . ఈ మీటింగ్ లో ఆర్డీవో శ్రీనివాసరావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, సర్వే ఏడీ నూకరాజు తదితరులు పాల్గొన్నారు.