తమిళనాడు రాజకీయాల్లో కావేరి జల వివాదం , మేకెదాటు డామ్ నిర్మాణం అంశం మరోసారి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ సమావేశాల వేళ అధికార టీవీకే పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
మేకెదాటు డ్యామ్ వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే డిమాండ్ చేయగా, సీఎం విజయ్ ఆ డిమాండ్‌ను బేఖాతరు చేస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు.మేకెదాటు ప్రాజెక్ట్ పేరుతో ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే అఖిలపక్ష సమావేశం అంటూ డ్రామాలు ఆడుతున్నారని సీఎం విజయ్ మండిపడ్డారు.
కావేరి నదీ జలాల్లో తమిళనాడు హక్కుల సాధన కోసం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, చట్టపరమైన మార్గాల ద్వారానే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. మేకెదాటు డ్యామ్ , కావేరి నీటి కేటాయింపుల అంశం తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలకు కేంద్ర బిందువుగా మారింది.
ఇటీవల తంజావూరులో జరిగిన రైతుల ఆందోళనల సమయంలో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, ఆపై చోటుచేసుకున్న పరిణామాలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఉదయనిధి ఆరోపించగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు, రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసలేంటి? మేకెదాటు వివాదం
ప్రతిపాదిత మేకెదాటు ప్రాజెక్ట్ కర్ణాటక, తమిళనాడుల మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతకు కారణమవుతోంది. ప్రధానంగా బెంగళూరు తాగునీటి అవసరాలను తీర్చడం, సుమారు 400 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం, ప్రస్తుతం బెంగళూరు సౌత్‌లో భాగంగా ఉన్న రామనగర జిల్లాలోని మేకెదాటు వద్ద కావేరి నదిపై ఒక జలాశయాన్ని నిర్మించాలని కర్ణాటక యోచిస్తోంది.
ALSO READ : జాతీయ మీడియా సంస్థలపై..కోర్టుకెక్కిన ఉదయ్ నిధి స్టాలిన్..
ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు కేటాయించిన కావేరీ నీటి వాటాపై ఎలాంటి ప్రభావం ఉండదని కర్ణాటక స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర నీటి లభ్యత, ప్రస్తుతం ఉన్న కావేరీ నీటి పంపిణీ ఒప్పందంపై ప్రభావం పడొచ్చని వాదిస్తూ తమిళనాడు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో తమిళనాడు అభ్యంతరాలను సీఎం విజయ్ ప్రస్తావించారు.
