వెలుగు ఓపెన్ పేజీ.. మానవ వనరుల అభివృద్ధి దిశగా.. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం

వెలుగు ఓపెన్ పేజీ.. మానవ వనరుల అభివృద్ధి దిశగా.. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం

ఒక దేశాన్ని సుసంపన్నంగా మార్చేది దాని భూమి కాదు. ఒక రాష్ట్రాన్ని శక్తిమంతంగా మార్చేది భవనాలు కాదు. అవకాశాలను అందిపుచ్చుకునే యువత.  విలువను సృష్టించే  నైపుణ్యాలు, భవిష్యత్తును నిర్మించే  విద్యే నిజమైన సంపద. చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే యువతను తీర్చిదిద్దిన దేశాలు అభివృద్ధిలో దూసుకెళ్లాయి. యువతను నిర్లక్ష్యం చేసిన దేశాలు వెనుకబడ్డాయి. 

‘ఒక చెట్టును నరికేయడానికి 6 గంటల సమయం ఇస్తే, మొదటి 4 గంటలు గొడ్డలికి పదును పెడతాను’ అని అబ్రహాం లింకన్ చెప్పారు. అభివృద్ధి కూడా అంతే. ఫలితాలు వెంటనే రావు. ముందు సామర్థ్యాలను పెంచుకోవాలి. మానవ వనరులను సిద్ధం చేసుకోవాలి.  విద్య, నైపుణ్యం, ఉపాధి అనే మూడు చక్రాలు సక్రమంగా తిరిగినప్పుడే అభివృద్ధి రథం ముందుకు సాగుతుంది.  

ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే .. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఉత్పాదకత పెరగాలి. ఉత్పాదకత పెరగాలంటే  పరిశ్రమలకు, సేవారంగానికి, సాంకేతిక రంగాలకు  అవసరమైన  నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండాలి. సహజ వనరులు ఉన్నంత మాత్రాన దేశాలు అభివృద్ధి చెందవు.  మానవ వనరులను అభివృద్ధి చేసిన దేశాలే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శిథిలాలుగా మారిన జపాన్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పారిశ్రామిక దేశంగా ఎదగడం వెనుక చమురు లేదు, బంగారం లేదు, గనులు లేవు. కానీ  క్రమ శిక్షణ, విద్య, నైపుణ్యం ఉన్నాయి. ‘మేడ్ ఇన్ జపాన్’ అనే  ముద్ర  నేడు  నాణ్యతకు  ప్రతీకగా నిలవడం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక ఎంతో కృషి ఉంది. దక్షిణ కొరియా ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటి.  కానీ విద్య, సాంకేతిక శిక్షణ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడి పెట్టింది. 

నేడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో ఆ దేశం అగ్రగామిగా నిలిచింది. జర్మనీ విజయానికి కారణమైన డ్యూయల్ వొకేషనల్ ట్రైనింగ్ మోడల్ ప్రపంచానికి ఆదర్శంగా మారింది. విద్యార్థి తరగతి గదిలో నేర్చుకుంటూనే పరిశ్రమలో పనిచేస్తాడు. అందుకే అక్కడ నిరుద్యోగం తక్కువ. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యవంతులైన యువత ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహజ వనరులు లేవు. మానవ వనరులను అత్యంత విలువైన ఆస్తిగా భావించింది. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్య, నైపుణ్య వ్యవస్థలను తీర్చిదిద్దింది. 

ఫలితంగా ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదగడం వెనుక కూడా ఇదే కథ ఉంది. భారీ స్థాయిలో నైపుణ్యవంతులైన మానవ వనరులను తయారు చేయడం ద్వారా ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించగలిగింది. ఈ దేశాలన్నీ  ప్రపంచానికి ఒకే పాఠం చెబుతున్నాయి.

ఉత్పాదకత పెరగాలంటే నైపుణ్యం పెరగాలి

ఉత్పాదకత  పెరగాలంటే  నైపుణ్యం పెరగాలి.. నైపుణ్యం  పెరగాలంటే విద్య మారాలి. విద్య మారాలంటే సంకల్పం ఉండాలి.  నేడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని  ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను పరిశీలిస్తే ఇదే ఆలోచన కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం పాలనను నిర్వహించడం కాదు.  రాబోయే రెండు, మూడు దశాబ్దాల  తెలంగాణను  దృష్టిలో  పెట్టుకుని  మానవ వనరుల అభివృద్ధికి  ప్రాధాన్యత ఇస్తోంది. సంక్షేమం అవసరమే. కానీ  సంక్షేమం  మాత్రమే సరిపోదు. 

అవకాశాలు  కూడా కల్పించాలి. పేదరికాన్ని తగ్గించాలంటే సబ్సిడీలు ఒక మార్గం అయితే,  విద్య,   నైపుణ్యాలు శాశ్వత పరిష్కారం.  ఒక యువకుడికి ఉద్యోగం దొరికితే ఒక కుటుంబం నిలబడుతుంది.  ఒక యువకుడికి  నైపుణ్యం వస్తే  తరాలు నిలబడతాయి అనే తత్వాన్ని ప్రభుత్వం కార్యాచరణలో చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే విద్య, నైపుణ్యం, ఉపాధిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే  ప్రయత్నం జరుగుతోంది.

యంగ్ ఇండియా స్కూల్స్..విద్యకు కొత్త నిర్వచనం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్   రెసిడెన్షియల్ స్కూల్స్. పేద,  మధ్యతరగతి,  గ్రామీణ కుటుంబాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్య అందించాలనే సంకల్పంతో ఈ విద్యాసంస్థలు రూపుదిద్దుకుంటున్నాయి.  ఒకప్పుడు కార్పొరేట్ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించాలనే ప్రయత్నం జరుగుతోంది. పేదవాడి బిడ్డకు  కూడా పెద్ద కలలు కనే హక్కు ఉంది అనే భావనకు యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతీకగా నిలు స్తున్నాయి. ఒక రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఆధునికీకరించే ప్రయత్నం చేస్తోంది. 

స్కిల్ యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు బ్లూప్రింట్

నేటి ప్రపంచంలో సంప్రదాయ డిగ్రీలు మాత్రమే సరిపోవు. పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలు అవసరం. అందుకే స్కిల్ యూనివర్సిటీ ఆలోచనకు ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకొచ్చింది.  ఇది కేవలం విద్యను అందించే విశ్వవిద్యాలయం కాదు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారుచేసే కేంద్రంగా మారబోతోంది.

విద్యా వ్యవస్థను ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుసంధానం చేసే వేదికగా నిలవబోతోంది. మన దేశంలో చాలాకాలంగా ఒక సమస్య వేధిస్తోంది. అదే.. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగానికి మళ్లీ శిక్షణ అవసరమవడం. ఆ సమస్యను పరిష్కరించాలంటే  ప్రస్తుత  విద్యావిధానంలో మార్పు రావాలి.  ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 

స్కిల్ యూనివర్సిటీలో  శిక్షణ  పొందిన  పలువురు  విద్యార్థులు ఇప్పటికే ప్రముఖ  కంపెనీల్లో భారీ వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత కూడా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడం విశేషం. 

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి పునాది మానవ వనరులే 

సీఎం  రేవంత్ రెడ్డి  తెలంగాణ కోసం నిర్దేశించుకున్న ‘విజన్-2047’,  3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కేవలం ఒక సంఖ్య కాదు. అది ఒక తరం కల.  ఒక రాష్ట్ర ఆశయం. ఒక సమగ్ర అభివృద్ధి దిశ. అయితే మూడు ట్రిలియన్  డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేవలం భవనాలు, రోడ్లు, పారిశ్రామిక పార్కులు నిర్మించడం ద్వారా సాధించలేం. పెట్టుబడులు రావాలంటే పరిశ్రమలు రావాలి. 

పరిశ్రమలు రావాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండాలి. ఉత్పాదకత పెరగాలి. ప్రపంచ మార్కెట్లలో పోటీపడే సామర్థ్యం ఉండాలి. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు యువతే కీలకం అందుకే రాష్ట్ర  ప్రభుత్వం  విద్య, నైపుణ్యం, ఉపాధి రంగాల్లో చేస్తున్న పెట్టుబడులు భవిష్యత్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై చేస్తున్న పెట్టుబడులు. ఇవే రేపటి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడానికి మార్గాలు.

కార్మిక సంక్షేమం అభివృద్ధికి మరో ఆయుధం 

యువతలో నైపుణ్యాభివృద్ధి ఎంత ముఖ్యమో, కార్మికుల సంక్షేమం కూడా అంతే ముఖ్యం. గిగ్ ఎకానమీ విస్తరిస్తున్న   ప్రస్తుత కాలంలో  గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం, కనీస వేతనాలను సవరించడం వంటి చర్యలు లక్షలాది మంది కార్మికులకు భరోసా కల్పిస్తున్నాయి.   రాష్ట్ర ప్రభుత్వం నేడు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలను మార్చబోతున్నాయి. 

యంగ్ ఇండియా స్కూల్స్‌‌‌‌‌‌‌‌లో  నాటుతున్న విద్యా విత్తనాలు, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లలో అందిస్తున్న  నైపుణ్యాలు, స్కిల్ యూనివర్సిటీలో రూపుదిద్దుకుంటున్న అవకాశాలు, ‘టీఓఎంసీఓఎం’ ద్వారా ప్రపంచానికి తెరుచుకుంటున్న ద్వారాలు, కార్మిక సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ కలిపి చూస్తే  తెలంగాణలో ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతున్నట్లు  కనిపిస్తోంది. విత్తనం నాటిన రోజే పంట రాదు. కానీ పంట రావాలంటే విత్తనం నాటాల్సిందే.  జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలు  మానవ వనరులను అభివృద్ధి చేసి ఆర్థిక శక్తులుగా ఎదిగినట్లే, తెలంగాణ కూడా నైపుణ్యాభివృద్ధిని  కేంద్ర బిందువుగా మార్చుకుంటే విజన్-2047 లక్ష్యం కేవలం కలగా మిగలదు,  గమ్యాన్ని 
చేరుకుంటుంది.

అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు

విద్య తర్వాతి దశ  నైపుణ్యం. డిగ్రీ ఉంటే సరిపోదు.  పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఉండాలి. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్  టెక్నాలజీ సెంటర్లుగా అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్  చేయడం కీలక నిర్ణయం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 65 అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు కావడం,  వచ్చే విద్యా సంవత్సరానికి వాటి సంఖ్యను 120కు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,  రోబోటిక్స్,  ఎలక్ట్రిక్ వెహికల్స్,  ఆటోమేషన్,  సీఎన్‌‌‌‌‌‌‌‌సీ మాన్యుఫాక్చరింగ్,  ఇండస్ట్రీ 4.0 వంటి భవిష్యత్ రంగాల్లో  శిక్షణ అందించడం ద్వారా తెలంగాణ యువతను  ప్రపంచ ఉద్యోగ  మార్కెట్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వం  సిద్ధం  చేస్తోంది.  ప్రస్తుతం 30వేల మంది శిక్షణ  పొందుతుండగా.. రాబోయే కాలంలో  50 వేల మందికి పైగా యువతకు శిక్షణ అందించాలనే లక్ష్యం పెట్టుకోవడం చిన్న విషయం కాదు. ఈ కార్యక్రమాల అమలులో కార్మిక,  ఉపాధి,  శిక్షణ,  ఫ్యాక్టరీలు,  గనుల శాఖ మంత్రి  గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.  శాఖను  కేవలం ప్రభుత్వ విభాగంగా  కాకుండా  యువత  భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రపంచానికి తెలంగాణ యువత

ప్రస్తుత ప్రపంచం సరిహద్దులు లేని ఉద్యోగ మార్కెట్‌‌‌‌‌‌‌‌గా మారుతోంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన తెలంగాణ  ప్రభుత్వం ‘టీఓఎంసీఓఎం’ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలను యువతకు అందిస్తోంది.  జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, యూకేతోపాటు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం అవసరమైన  భాష,  నైపుణ్య శిక్షణను కూడా అందిస్తోంది. ఇటీవల మందమర్రిలో జర్మన్ భాషా  శిక్షణ కేంద్రాన్ని మంత్రి  వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ‘టీఓఎంసీఓఎం’  కేంద్రంలో  మరొక కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఒకప్పుడు విదేశీ భాష నేర్చుకోవడమంటే  చాలా  ఖర్చుతో  కూడుకున్నది. ఇప్పుడు నిరుపేద విద్యార్థులకు కూడా కూడా 
ఆ అవకాశం అందుతోంది.  మందమర్రిలో  జర్మన్ భాష నేర్చుకుంటున్న విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల  స్టైపెండ్‌‌‌‌‌‌‌‌ను కూడా కాకా ట్రస్ట్ తరఫున అందిస్తామని కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ఇది కేవలం ఉపాధి కార్యక్రమం కాదు. తెలంగాణ యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్యమం.

-నవీన్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ 
వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com