బెంగళూరులో విషాదం: మురుగునీటి ప్లాంట్‌లో పడి ఇద్దరు కార్మికుల మృతి..

బెంగళూరులో విషాదం: మురుగునీటి ప్లాంట్‌లో పడి ఇద్దరు కార్మికుల మృతి..

బెంగళూరు బెల్లందూర్ మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ఈరోజు(జూన్ 19) సాయంత్రం  ఒక విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న 40 అడుగుల లోతైన మురుగునీటి బావిని (వెట్ వెల్) ముగ్గురు కార్మికులు శుభ్రం చేస్తుండగా, అందులో ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడి మునిగిపోయారు.

బాధితులు బీహార్ చెందిన బ్రిజేష్ (30 ఏళ్లు), తమిళనాడుకి చెందిన అఖిలేష్ (30 ఏళ్లు) అనే ఇద్దరు కార్మికులు ఈ ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడో కార్మికుడిని సకాలంలో రక్షించి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది బావిలో పడిపోయిన వారి మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ దారుణ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) ఒక ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘోరం జరిగింది? అనే విషయాలను తేల్చాలని బోర్డు ఆదేశించింది. జూన్ 20వ తేదీ మధ్యాహ్నానికల్లా పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ ఛైర్మన్‌కు అందించాలని కమిటీని కోరింది.