రూ.6.5 కోట్ల అపార్ట్మెంట్ ప్లాట్: శాఖాహారులకు మాత్రమే అమ్ముతాం..!

రూ.6.5 కోట్ల అపార్ట్మెంట్ ప్లాట్: శాఖాహారులకు మాత్రమే అమ్ముతాం..!

సముద్రానికి ఎదురుగా.. ఎంతో ఆహ్లాదకరమైన అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ అవి.. అక్కడ ధర కోట్లలో ఉంటుంది. డబుల్ బెడ్ రూం 2BHK ప్లాట్ ధర అక్షరాల 6 కోట్ల 50 లక్షల రూపాయలు. ఆ ఏరియాలో ఆ మాత్రం ఉంటుంది. మీరు 6 కోట్ల 50 లక్షల రూపాయలు కడతాం.. మాకు అమ్మండి అంటే అమ్మరు.. దీనికి ఓ కండీషన్ ఉంది.. శాఖాహారులకు మాత్రమే.. ప్యూర్ వెజ్ కుటుంబానికే ఈ ప్లాట్ అమ్ముతాం అని దర్జాగా యాడ్ ఇచ్చారు. దేశంలో ఇంత ఖరీదైన అపార్ట్ మెంట్ ప్లాట్.. కొనుగోలుదారుడికే కండీషన్ పెట్టటం అనేది దేశాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ కథనం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణ ముంబైలోని టార్డియో ప్రాంతంలో రూ.6.5 కోట్ల విలువైన 2BHK అపార్ట్‌మెంట్ శాకాహారులకు మాత్రమే అని లిస్ట్ చేయడంతో హౌసింగ్ డిస్క్రిమినేషన్ అనే అంశంపై తీవ్ర చర్చ మొదలైంది. 

సుమారు 900 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉన్న ఈ ఫ్లాట్‌లో అటాచ్డ్ బాల్కనీ, దక్షిణ ముంబై, సముద్రం దృశ్యాలు, సర్ఫేస్, పోడియం పార్కింగ్ సౌకర్యం ఉన్నాయి. అయితే లిస్టింగ్‌లో వెజిటేరియన్స్ ఓన్లే (Vegetarian Only) అని స్పష్టంగా పేర్కొనడంతో మాంసాహారులు   నివసించడానికి అనుమతి లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రాపర్టీ డీలర్, ఇన్‌ఫ్లుయెన్సర్ భవేష్ కవారే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫ్లాట్ గురించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు 46 వేలకు పైగా వ్యూస్, 700కు పైగా లైక్స్ వచ్చాయి. తక్కువ టైమ్ లో ఎక్కువ స్ప్రెడ్ అయిన ఈ వీడియోపై  డిబేటే నడుస్తోంది. 

సోషల్ మీడియాలో చాలా మంది ఆహార అలవాట్ల ఆధారంగా ఇండ్లు కేటాయించడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఇండ్లు అద్దెకు ఇచ్చేవారు.. శాఖాహారులకు మాత్రమే అని పెట్టడం చూశాం కానీ.. అమ్మే వారు కూడా శాఖాహారులకు మాత్రమే అనే బోర్డు పెట్టడం అంటే.. మాంసాహారులపై వివక్ష చూపించడమే కదా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలను ట్యాగ్ చేస్తూ.. ఇలాంటి బోర్డు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ALSO READ : వైరల్‌గా మారిన ఫుడ్ డైవర్స్ ట్రెండ్.. 

షిండే సేన యువ నేత గుర్జ్యోత్ సింగ్ కీర్ ఈ లిస్టింగ్‌ను విమర్శిస్తూ, మరాఠీలకు అనుమతి లేదా అనే ప్రశ్నలు లేవనెత్తారు. ముంబైలో ఆహార అలవాట్లు, కమ్యూనిటీ ఆధారంగా సొసైటీలు ఆంక్షలు విధించడంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది.

ఈ శాకాహారులకు మాత్రమే నిబంధన సొసైటీ అధికారిక నిబంధనా.. లేక ఓనర్ కండిషనా..  లేదా బ్రోకర్ వివరణా అనేది స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ ఈ వైరల్ లిస్టింగ్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో.. ఆహార అలవాట్ల ఆధారంగా ఆంక్షలు సరైనవా అనే ప్రశ్నలను మళ్లీ రేకెత్తించింది.

కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష, జాతి వివక్ష.. ఇలా ఇండియాలో ఎన్నో రకాల డిస్క్రిమినేషన్స్ మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతూనే ఉన్నా.. భారతీయ సమాజం అలా ముందుకు సాగుతూనే ఉంది. నవనాగరికతను దాటుకుంటూ టెక్నాలజీ మీదుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం.. అయినా సమాజంలో ఇలాంటి ధోరణలు పెరిగిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.