టాటా గ్రూప్‌లో జరుగుతున్న పరిణామాలు స్టాక్ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిస్తున్నాయి. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయటంతో టాటా గ్రూప్‌కు చెందిన పలు లిస్టెడ్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా టాటా గ్రూప్‌లో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన TCS షేర్ ధర దాదాపు 5 శాతం వరకు పడిపోయింది. పెట్టుబడిదారుల్లో నాయకత్వ మార్పుపై ఆందోళనలను పెరగటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
అసలు టీసీఎస్ అంటేనే చంద్రశేఖరన్.. చంద్రశేఖరన్ అంటేనే టీసీఎస్ అని ఐటీ ప్రపంచంలో ఒక టాక్. అందుకే దివంగత రతన్ టాటా కూడా తొలిసారిగా టాటా కుటుంబానికి సంబంధం లేని ఎన్ చంద్రశేఖరన్ కు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అయితే బోర్డు సభ్యుల్లో ఒకరికి తాను ఛైర్మన్ గా ఉండటం ఇష్టం లేదని అందువల్లనే తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజీనామాపై వివరణ ఇచ్చారు. అయితే టాటా బోర్డు ఆయనకు నమ్మకాన్ని కల్పించి తిరిగి ఎంపిక చేసుకుంటుందా లేక కొత్త నాయకత్వం వైపు అడుగులు వేస్తుందా అనే ప్రశ్న ప్రస్తుతం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో TCS షేరు NSEలో రూ.2వేల 337 వద్ద ట్రేడవుతూ 4.55 శాతం నష్టపోయింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1.6 శాతం, టైటాన్ 1.3 శాతం మేర దిగజారాయి. టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ కంపెనీ షేర్లు కూడా వరుసగా 1.13 శాతం, 1.04 శాతం నష్టపోయాయి. టాటా టెక్నాలజీస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మొత్తం మార్కెట్‌లో బలహీనత, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఈ పతనానికి అదనపు కారణాలుగా నిలిచాయని నిపుణులు అంటున్నారు.
టీసీఎస్‌లో చంద్రశేఖరన్ ప్రస్థానం
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరి.. 2009లో TCS సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. దీని తర్వాత మళ్లీ ఆయననే కొనసాగించే ప్రతిపాదనపై టాటా సన్స్ బోర్డులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ నిర్ణయం కొంతకాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే బోర్డు నిర్ణయానికి ముందే చంద్రశేఖరన్ తప్పుకుంటూ రిజైన్ చేయటం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ : షార్ట్ కట్ మీ జీవితాన్ని కట్ చేస్తుంది..!
చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటించిన వెంటనే టాటా స్టాక్స్‌లో కనిపించిన అమ్మకాలను మార్కెట్ నిపుణులు ప్రధానంగా ‘లీడర్‌షిప్ అన్‌సర్టైంటీ’కి సంబంధించిన రియాక్షన్ గా చూస్తున్నారు. అంటే కంపెనీల పనితీరు ఒక్కరోజులో మారిపోయిందని కాదు; గ్రూప్‌కు తదుపరి నాయకత్వం ఎవరు, భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నలు పెట్టుబడిదారుల్లో అప్రమత్తతను పెంచాయి. షేర్లలో వచ్చిన ఒక్కరోజు పతనాన్ని చూసి టాటా గ్రూప్ స్టాక్స్ భవిష్యత్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని చెప్పొచ్చు. కొత్త చైర్మన్ ఎంపిక, నాయకత్వ మార్పు సాఫీగా జరిగే విధానం, టాటా సన్స్ భవిష్యత్ వ్యూహాలపై స్పష్టత వంటి అంశాలు ఇకపై కీలకం కానున్నాయి.
