- దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ప్రారంభించిన పీసీసీఎఫ్ సువర్ణ
హైదరాబాద్, వెలుగు : అడవులు, పర్యావరణాన్ని కాపాడటంలో అటవీ శాఖ అధికారుల పాత్ర కీలకమని, అటవీ సంరక్షణే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్) సి. సువర్ణ అన్నారు. శుక్రవారం దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో ఎఫ్ఆర్ఓల 12వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ బ్యాచ్‌లో ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన 58 మంది ట్రైనీలు పాల్గొంటుండగా, 18 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణలో నైపుణ్యం సాధించాలని ట్రైనీలకు సూచించారు.
అడవుల్లో జరిగే నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో అడవుల విస్తీర్ణం పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ కాలంలో క్రమశిక్షణ, నిబద్ధతతో నేర్చుకుని తమ తమ రాష్ట్రాల్లో సమర్థవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంకా వర్గీస్, ప్రధాన అటవీ సంరక్షణాధికారి డాక్టర్ ఎస్.జె. ఆశా అటవీ పరిపాలన, నిర్వహణ అంశాలను ట్రైనీలకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ అటవీ అధికారులు మాధవరావు, కంపా శ్రీనివాస్, రేఖ భాను, మంజుల, నాగమణి, శ్రీనివాస్ తదితరులు అటవీ రంగంలో వస్తున్న కొత్త సవాళ్లు, అవకాశాలపై అవగాహన కల్పించారు.
