- తెల్ల కాగితాలపై లేదా అనధికారిక పత్రాలు అనుమతించం
- మేం ఇచ్చిన ఫామ్‌లో ఓటరు పేరు, చిరునామా, ఫొటో ఉన్నదే ప్రామాణికం
- ఒక వర్గం ఓట్లను తొలగిస్తారనేది దుష్ప్రచారం
- మ్యాపింగ్ కాకపోతే ఓటు పోతుందనే అపోహ వద్దు
- స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తే.. ఓటరు జాబితాపై ఈసీకి లేఖ రాస్తం
- జులై 31న డ్రాఫ్ట్, ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
- అక్టోబర్ 1న తుది జాబితా.. రాజకీయ పార్టీలు సహకరించాలని సీఈవో విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం ఈ నెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, జూన్ 25 నుంచి జులై 24 వరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల నమోదు, సవరణల ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3.38 కోట్ల మంది ఓటర్లకు ఫారాలు అందిస్తామని తెలిపారు. ఒక నెలపాటు వివరాలు నమోదు చేసిన ఫారాలు బీఎల్వోలు సేకరిస్తారని, జులై 25 తర్వాత ఈ ఫారాల స్వీకరణకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండదన్నారు. ఫాం నింపకపోయినా, నింపిన ఫాం ఇవ్వకపోయినా ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉండదని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 48 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను బీఎల్వోలుగా నియమించామని, వీరంతా తప్పనిసరిగా తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.
బీఎల్వోల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రతి 10 మంది బీఎల్వోలకు ఒక సూపర్‌వైజర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొందరు బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకున్నామని, కొంతమందిని సర్వీసుల నుంచి కూడా తొలగించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈసారి కూడా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతోపాటు కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి పనిచేసే వ్యవస్థ అని, ఇక్కడ మతాలు, కులాలు లేదా ప్రాంతాల ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండబోదని తెలిపారు.
ఓటు తీసేస్తే లిఖిత పూర్వకంగా కారణాలు చెప్పాలి
ఓటరు సవరణ ప్రక్రియలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ఎన్యుమరేషన్ ఫారాన్ని’ మాత్రమే ఉపయోగించాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఫారంలో ఓటరు పేరు, చిరునామా, ఫొటో, పాత ఎపిక్ కార్డు నెంబరులాంటి వివరాలు ముందే ముద్రించి (ప్రీ-ఫిల్డ్) ఉంటాయని, ఇది ఓటర్ల గుర్తింపును మరింత సులభతరం చేస్తుందని తెలిపారు. కొందరు తెల్ల కాగితాలపై లేదా అనధికారిక పత్రాలపై వివరాలు సేకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి వాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని ఆయన తేల్చి చెప్పారు.
ఓటరు స్వయంగా సంతకం చేసిన అధికారిక ఎన్యుమరేషన్ ఫారాలను మాత్రమే తమ సిబ్బంది స్వీకరిస్తారని, దీంతో నకిలీ ఓట్ల నమోదును అడ్డుకోవచ్చన్నారు. ఓటర్లు కూడా తమ వివరాలను జాగ్రత్తగా చూసుకుని, ఏవైనా తప్పులుంటే బీఎల్వోల సహాయంతో అక్కడికక్కడే సరిచేసుకునేందుకు వీలుంటుందని సుదర్శన్ రెడ్డి వివరించారు. ఒకవేళ ఎవరి ఓటునైనా తొలగించాల్సి వస్తే, అందుకు గల స్పష్టమైన కారణాలను వివరిస్తూ లిఖితపూర్వకంగా ‘స్పీకింగ్ ఆర్డర్’ జారీ చేస్తారన్నారు. ఈఆర్వోల నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఓటర్లు జిల్లా కలెక్టర్‌కుగానీ లేదా నేరుగా సీఈవో కార్యాలయానికిగానీ అప్పీలు చేసుకునే అవకాశం కల్పించినట్టు తెలిపారు.
70.5 శాతం మ్యాపింగ్.. పట్టణాల్లోనే తక్కువ
‘సర్’ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివర కు దాదాపు 70.5 శాతం మ్యాపింగ్ పూర్తయిందని సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కాగా, మ్యాపింగ్ కు ఓట్ల తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదని, ఓటర్లకు అందే ఫారంలు సరిగ్గా నింపి, అందులో ఉన్న ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతేనే సమస్య ఉం టుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ మ్యాపింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో కేవలం 45.5 శాతం, మేడ్చల్‌లో 43.5 శాతం, రంగారెడ్డిలో 56.5 శాతం మాత్రమే మ్యాపిం గ్ పూర్తయిందని వివరించారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజ లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరచూ నివాసాలను మార్చడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియలో దాదాపు 11 నుంచి 12 రకాల ఓటర్ల వ్యత్యాసాలను గుర్తించి నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85 లక్షల మంది ఓటర్ల వివరాలలో ఏవో కొన్ని సాంకేతిక లోపా లు లేదా వ్యత్యాసాలు ఉన్నట్టు తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని తెలిపారు. ఈ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఎవరి ఓటునూ నేరుగా తొలగించబోమని, లోపాలు ఉన్న ప్రతి ఓటరు పేరును కూడా మొదట ముసాయిదా జాబితాలోనే ఉంచుతామని స్పష్టం చేశారు.
ఓటరు చిరునామా తప్పుగా ఉండడం, ఒకే ఇంట్లో పెద్ద సం ఖ్యలో ఓట్లు నమోదు కావడం, ఫొటోలు స్పష్టంగా లేక పోవడంలాంటి లోపాలన్నింటినీ ఈ కాలంలో క్షేత్రస్థాయిలో బీఎల్వోల ద్వారా సరిచేస్తామని చెప్పారు. సాధా రణంగా వివాహం తర్వాత మహిళల ఓటును భర్త పేరుతో అనుసంధానిస్తామని, కానీ ‘సర్’లో డాటర్ ఆఫ్‌గానే ఎందుకు పరిగణిస్తున్నారని ప్రశ్నించగా, ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 నాటి ప్రాథమిక బేస్‌లైన్ డేటాతో మ్యాపింగ్ చేయడమే ఇందుకు కారణమని తెలిపారు. వివాహిత మహిళలను వారి పుట్టింటి వివరాలతో లేదా తల్లిదండ్రుల డేటాతో సరిపోల్చడం ద్వారా వారి మూలాలు ఓటు ప్రామాణికతను కచ్చితంగా ధ్రువీకరించడానికి వీలవుతుందని వివరించారు.
పారిశుధ్య కార్మికులు, స్వీపర్లను బీఎల్వోలుగా తొలగించినం
జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు, చివరకు కుక్కలను పట్టే సిబ్బంది ని కూడా బీఎల్వోలుగా నియమించారనే అంశం రెం డు నెలల క్రితం తమ దృష్టికి వచ్చిందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. వెంటనే స్పందించి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, అలాంటి అనర్హులైన సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కనీస విద్యార్హతలు కలిగిన జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులను బీఎల్వోలుగా నియమించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
గ్రేటర్, ఎంపీటీసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పరిధిలోని అంశమని సుదర్శన్ రెడ్డి గుర్తుచేశారు. సర్ ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీ నాటికి తుది రూపానికి వస్తుందని, ఆ తర్వాత ఈ డేటాను స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు షెడ్యూల్ ఇస్తే.. ఓటరు జాబితా ఇవ్వడంపై ఈసీకి లేఖ రాసి స్పష్టత తీసుకుంటామని సుదర్శన్ రెడ్డి వివరించారు.
5 లక్షల డబుల్ ఓట్లు తొలగించం
రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారిన ఓటర్లు ‘ఫారం-8’ సమర్పించాలని, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కొత్తగా నమోదు కోసం ‘ఫారం-6’ పూరించాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఇక ఎన్యుమరేషన్ ఫారాల భాషా వివాదంపై స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫారాలను కేవలం తెలుగులోనే పంపిణీ చేస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలో ఇంగ్లిష్ ఫారాలను కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి ఫొటో లేదా పేరుతో ఇతర నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లను డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ (డీఎస్‌ఈ) సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తిస్తున్నట్లు చెప్పారు. గత 6 నెలల కాలంలోనే రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది డీఎస్‌ఈ ఓట్లను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించి, క్షుణ్నంగా వెరిఫై చేసి తొలగించామని వివరించారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన 12 డాక్యుమెంట్లలో ఏదైనా ఓకే
కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల అధికారిక పత్రాలలో కొన్ని ఫ్యామిలీ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, పర్మినెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్‌లాంటివి మన రాష్ట్రంలో అందుబాటులో లేవని, వాటి స్థానంలో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డ్)లాంటి వాటిని అనుమతించాలన్న రాజకీయ పక్షాల అభ్యర్థనను ప్రస్తావించారు. నిబంధనలలో పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచనాత్మకమై నదేనని, తుది నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ అధికారిక పత్రాన్నైనా ఓటరు గుర్తింపు ధ్రువీకరణ కోసం ఈఆర్వోలు తమ విచక్షణ మేరకు అంగీకరించ వచ్చని తెలిపారు. అందువ ల్ల ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగా అందుబాటులో ఉండే ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలను సమర్పించి వివరాలను బీఎల్వోల వద్ద ధ్రువీకరించుకోవచ్చని ఆయన వివరించారు.
