సౌతాంప్టన్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా విమెన్స్ జట్టు.. టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలను సాధించింది. బెత్ మూనీ (74), ఆష్లే గార్డెనర్ (58), జార్జియా వారెహామ్ (41) చెలరేగడంతో.. శనివారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 98 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.
టాస్ ఓడిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. జార్జియా వోల్ (17), అనాబెల్ సదర్లాండ్ (11 నాటౌట్) మోస్తరుగా ఆడారు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 121/3 స్కోరుకే పరిమితమైంది. బబెటి డి లీడె (56 నాటౌట్), స్టీర్ కలిస్ (44) రాణించినా ప్రయోజనం దక్కలేదు. మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
పాక్ హ్యాట్రిక్ ఓటమి
మరోవైపు బంగ్లాదేశ్ చేతిలో 23 రన్స్ తేడాతో ఓడిన పాకిస్తాన్ నాకౌట్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ముందుగా బంగ్లా 20 ఓవర్లలో 123/6 స్కోరు చేసింది. షోర్నా అక్తర్ (39 నాటౌట్), నిగర్ సుల్తానా (36), శోభన మోస్ట్రే (22) రాణించారు. తర్వాత పాక్ 20 ఓవర్లలో 100/8 స్కోరుకే పరిమితమైంది. మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సంజీదా అక్తర్, నహిదా అక్తర్ చెరో మూడు వికెట్లు తీశారు.
