Fathers day special 2026: నాన్నంటే భరోసాయే కాదు...కొండంత ధైర్యం కూడా..!

Fathers day special 2026:  నాన్నంటే భరోసాయే కాదు...కొండంత ధైర్యం కూడా..!

‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ’ అని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. ఈ నాలుగు మాటలను అనుసరిస్తే, భగవంతుడిని దర్శించుకున్నట్లేనని పెద్దలు చెప్తారు. జీవితంలో సరైన దారిని చూపే మొట్టమొదటి వ్యక్తి తండ్రి కనుక.. గురువు అనే పదానికి తండ్రి అనే అర్థం కూడా ఉంది. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజ్యాభిషేకం వదులుకుని, అరణ్యవాసం చేసి, పితృవాక్య పరిపాలకుడుగా నిలబడ్డాడు రాముడు. నేటికీ రాముడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. 

మహాభారతంలో భీష్ముడు తన తండ్రి కోసం బ్రహ్మచర్యం వహిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి, భీష్ముడయ్యాడు. ఇక శ్రవణ కుమారుడి కథను పరిశీలిస్తే... అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని, ఆ కావడిని భుజాన వేసుకుని మోసుకుంటూ జీవితం గడిపాడు. తల్లిదండ్రుల పట్ల అంత గౌరవాన్ని ప్రదర్శించిన కథలు ఇవన్నీ.

ఇక తండ్రిని పరిశీలిస్తే –

పశుపక్ష్యాదులలో సైతం మగ పక్షులు తమ పిల్లల కోసం ఆహారం సంపాదించి తీసుకువస్తాయి. కొన్ని రకాల పక్షులు గూళ్లు నిర్మిస్తాయి. ‘నాన్నంటే భరోసా... నాన్నంటే కొండంత ధైర్యం, పిల్లలను నడిపించే దిక్సూచి నాన్న’ అని అనుభవజ్ఞులు చెప్తుంటారు. 

శకుంతలోపాఖ్యానంలో – 

శకుంతల భరతుణ్ణి వెంటబెట్టుకుని తండ్రిౖయెన దుష్యంతుని దగ్గరకు తీసుకు వెళ్లిన సందర్బంలో, దుష్యంతుడు ‘మీరెవరో నాకు తెలియదు’ అని పలుకుతాడు. అందుకు శకుంతల, ‘పుత్ర గాత్ర పరిష్వంగము’ కన్న బిడ్డను కౌగిలించుకున్నందు వల్ల కలిగే ఆనందం గురించి పలుకుతుంది.

 ‘బాలార్క తేజుడగు ఈ బాలుడు నీ పుణ్య తనువు వలన కలిగాడు. ఈ బిడ్డను ఒక్క సారి కౌగిలించుకుని చూడు. నీకే తెలుస్తుంది..’ అంటూ ‘విపరీత ప్రతిభాషలేమిటికి? ఉర్వీనాథ! యీ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంబు చేకొనుము. ఈ ఆనందంతో ఏదీ సాటిరాదు’ అని పలుకుతుంది. తండ్రికి తన సంతానం స్పర్శ అంత హాయినిస్తుందని నన్నయ చెప్తున్నాడు.

తండ్రి పేరు ఆధారంగా చేసుకుని రాముడిని దాశరథి అని, వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడిని వాసుదేవుడు అని పిలవటం తెలిసిందే.

వ్యాసం వసిష్ఠ నప్తారం
శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే
శుక తాతం తపోనిధిం

ఈ ఒక్క శ్లోకం చాలు తండ్రి పేరుతో పిల్లలను గురించి పలకటం. వ్యాసుడు... శుకునికి తండ్రి, పరాశరుని కుమారుడు, శక్తికి మనుమడు, వసిష్ఠునికి ముని మనుమడు. వ్యాసుడంతటి వాని గురించి చెప్పడానికి ఇంతమందిని ప్రస్తావించారు. అదీ తండ్రి ఔన్నత్యం. 

అనగనగా ఒక ఊరిలో పరంధామయ్య అనే రైతు ఉన్నాడు. అతడికి రంగయ్య అనే కొడుకు ఉన్నాడు. తండ్రికి కొడుకంటే వల్లమాలిన ప్రేమ. కొడుకును కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆ కొడుకు పెద్దవాడయ్యాడు. యుక్తవయస్సు రాగానే రంగయ్యకు వివాహం చేశాడు పరంధామయ్య. కొంతకాలానికి రంగయ్యకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి రాజయ్య అని పేరు పెట్టాడు. రాజయ్యకు ఆరు సంవత్సరాలు రాగానే బడిలో వేశాడు. 

ఒకరోజు రాజయ్య బడి నుంచి ఇంటికి వస్తుండగా పెద్ద వర్షం కురుస్తోంది. వెంటనే రంగయ్య ఒక గొడుగు తీసుకుని బడికి బయలుదేరాడు. వెనక నుంచి పరంధామయ్య ‘రంగా! తడిసిపోతావు. నీకు మరో గొడుగు ఇస్తాను ఉండు’ అన్నాడు. 

అందుకు రంగయ్య, ‘నాన్నా! నేనేం తడవనులే, నన్ను తొందరగా వెళ్లనీ, నేను వెళ్లడం ఆలస్యమైతే నా కొడుకు  తడిసిపోతాడు’ అని కొంచెం విసుగ్గా మాట్లాడాడు. పరంధామయ్య నవ్వుతూ, ‘నీ కొడుకు తడిసిపోతాడని నువ్వు గొడుగు తీసుకువెళ్తున్నావు, మరి నా కొడుకైన నువ్వు తడిసిపోతుంటే నాలోని తండ్రి మనసు బాధపడదా’ అన్నాడు. 

రంగయ్య కళ్లు చెమర్చాయి. ‘నిజమే కదా, నా తండ్రిది కూడా తండ్రి మనసే కదా’ అనుకుని, తండ్రి ఇచ్చిన గొడుగు వేసుకుని బడికి బయలుదేరాడు. తండ్రి మనసును ప్రతిబింబించే ఈ కథ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. తన పిల్లలు ఎంత పెద్దవారైనప్పటికీ, తండ్రికి మాత్రం వారు చిన్నపిల్లలుగానే కనిపిస్తారు.

- డా. పురాణపండ వైజయంతి (ఫాదర్స్‌ డే సందర్భంగా)