- 2.85 లక్షల మంది టార్గెట్ కాగా..91 వేల మందికే టీకాలు
- హైదరాబాద్‌లో కేవలం 3 శాతం మందికే అందిన వ్యాక్సిన్
- ఆగస్టు వరకు గడువు పొడిగించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తలపెట్టిన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ ప్రక్రియ స్లోగా సాగుతున్నది. లక్ష్యం భారీగా ఉన్నా, ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.85 లక్షల మంది బాలికలకు టీకాలు వేయాలని టార్గెట్ పెట్టుకోగా.. జూన్ 17వ తేదీ వరకు కేవలం 91,289 మందికి మాత్రమే అంటే 28.4 శాతం మందికే టీకాలు అందాయి.
ఇతర రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్ వంటివి 100 శాతానికి పైగా లక్ష్యాన్ని చేరుకుని రికార్డు సృష్టిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నది. వాస్తవానికి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ జూన్ 8 నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో టీకా పంపిణీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును ఆగస్టు వరకు పొడిగించింది.
అవగాహన కల్పించడంలో ఫెయిల్
బయట ప్రైవేట్ లో వేల రూపాయలు ఇస్తేనే లభించే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రభుత్వం ఫ్రీగా అందిస్తున్నది. 14 ఏండ్ల వయసులో ఈ టీకా వేస్తే క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. తల్లిదండ్రుల కన్సంట్ తోనే బాలికకు వ్యాక్సిన్ వెయాల్సి ఉంటుంది. అయితే, దీనిపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంలో ఆరోగ్య శాఖ అధికారులు ఫెయిల్ అయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ఎండల తీవ్రత, వేసవి సెలవులు, పరీక్షల వల్ల బాలికలు అందుబాటులో లేరనేది ఒకకారణం అయినప్పటికీ.. అసలు కారణం యంత్రాంగం వైఫల్యమేనన్న విమర్శలు వస్తున్నాయి. స్కూళ్లు మూసివేసిన సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పిల్లలకు టీకాలు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఆగస్టులోపైనా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రజలు, నిపుణులు కోరుతున్నారు.
హైదరాబాద్ లోనే తక్కువ...
చదువుకున్న వాళ్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ జిల్లాలోనే వ్యాక్సినేషన్ డ్రైవ్ అత్యంత స్లోగా నడుస్తున్నది. ఇక్కడ కేవలం 1,177 మందికి అంటే 3శాతం మాత్రమే వ్యాక్సిన్ వేయడం గమనార్హం. ఇదే బాటలో మేడ్చల్-మల్కాజిగిరి 8 శాతం, నల్గొండ 12 శాతం, నాగర్ కర్నూల్ 15 శాతంతో అట్టడుగున నిలిచాయి. అయితే గ్రామీణ జిల్లాలైన పెద్దపల్లి (74 శాతం), రాజన్న సిరిసిల్ల (68 శాతం), ఖమ్మం (65 శాతం) జిల్లాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.
ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అవగాహన లోపం, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కాగా, డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం దేశంలో ఏటా 1.20 లక్షల మంది కొత్తగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాదాపు 80 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో ముఖ్యమైన హెచ్‌పీవీ వ్యాక్సిన్ ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నప్పటికీ.. అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడం వల్ల బాలికలకు వ్యాక్సిన్ చేరడంలేదు.
