రైతులకు గుడ్ న్యూస్:సాగునీరందిస్తాం.. రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీంతో ..కృష్ణా జలాలు సద్వినియోగం

రైతులకు గుడ్ న్యూస్:సాగునీరందిస్తాం.. రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీంతో ..కృష్ణా జలాలు సద్వినియోగం
  •     ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     పంపుహౌస్​ పనులు స్పీడప్​ చేయాలని అధికారులకు ఆదేశం

మేళ్లచెరువు/మఠంపల్లి, వెలుగు: కృష్ణా నది జలాలను సద్వినియోగం చేసుకునేందుకే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాదారంలో రూ.394 కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను చేపట్టామని రాష్ట్ర సివిల్ సప్లయ్స్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. శనివారం ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్, కోదాడ, చిలుకూరు మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 

పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ పనులు 34.50 మీటర్ల వరకు పూర్తయ్యాయని, 21.8 కి.మీ పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో 6 కి.మీ పూర్తైందన్నారు. 4 భారీ పంపులు, 3 వర్టికల్ టర్బైన్ పంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తికాకపోవడంపై కాంట్రాక్టర్లను ప్రశ్నించిన మంత్రి, ఇకపై ప్రతి వారం సమీక్షిస్తానని హెచ్చరించారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కృష్ణా నది పక్కన ఉన్నా సాగు, తాగునీటి సమస్యలు ఉండటంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశామని చెప్పారు. చివరి ఆయకట్టు భూములకు కూడా నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ పట్టణ తాగునీటి అవసరాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చేలా డిజైన్ చేయాలని సూచించారు. అనంతరం మేళ్లచెరువు–చింతలపాలెం మధ్య రూ.10 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. మఠంపల్లి మండలంలో పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో నిర్మాణంలో ఉన్న ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ, ఇరిగేషన్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాల పనులను పరిశీలించారు.