మంచిర్యాల, వెలుగు: పెండ్లంటే బ్యాండ్ మేళం, భారీ డెకరేషన్, తీరొక్క వంటలు, బంధుమిత్రుల సందడి.. ఎవరికి వారు తమ ఫైనాన్షియల్, సోషల్స్టేటస్కు ఏమాత్రం తగ్గకుండా హంగూ ఆర్భాటాలు కామన్. కానీ ఇందుకు భిన్నంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఓ వివాహ వేడుక అందరినీ ఆకట్టుకుంది. సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ జీఎం ఆఫీసులో లీగల్ సెల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గోషిక మల్లేశ్ సామాజిక ఉద్యమకారుడు. తన కూతురు స్నేహ వివాహం రఘుచంద్తో నిరాడంబరంగా జరిపించారు.
ముందుగా మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత శుభం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వేడుకలో సీపీఆర్‌పై నిపుణులతో అవగాహన కల్పించారు. గుండెపోటు లేదా అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేసే విధానం గురించి బంధుమిత్రులకు తెలియజేశారు. అలాగే ప్రకృతి మిత్ర సంస్థ నిర్వాహకులు గుండేటి యోగేశ్వర్ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ అతిథులకు మొక్కలు అందజేశారు. స్నేహ అడ్వకేట్ కాగా, రఘుచంద్ ఫొటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్నారు. బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకను సామాజిక బాధ్యత వేదికగా మార్చిన మల్లేశ్‌ను అభినందించారు.
