నిర్మల్, వెలుగు: జిల్లాలోని పేద ప్రజలందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న ఓపీ సేవల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని, అవసరమైన వారికి వెంటనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు.
వివిధ విభాగాలను సూచించే సైన్ బోర్డులను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య సేవలందించడంలో ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొత్తగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించారు. ఆస్పత్రి పర్యవేక్షకుడు గోపాల్ సింగ్, మెడికల్‌కాలేజీ ప్రిన్సిపాల్ శారద, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
