రైలు కాదు.. చక్రాలపై నడిచే లగ్జరీ హోటల్‌‌..వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ వైరల్

రైలు కాదు..  చక్రాలపై నడిచే లగ్జరీ హోటల్‌‌..వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ వైరల్

ముంబై: ప్రయాణికులకు సరికొత్త లగ్జరీ అనుభూతిని అందించేందుకు భారతీయ రైల్వే త్వరలోనే ముంబై– బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్‌‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ ఏసీ కోచ్ ఇంటీరియర్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌ అవుతున్నాయి. దీని అద్భుతమైన డిజైన్, ప్రీమియం లుక్‌‌ను చూసిన నెటిజన్లు ఇది రైలు పెట్టె కాదు.. చక్రాలపై నడిచే లగ్జరీ హోటల్ రూమ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రైన్‌‌కు సంబంధించిన ఫస్ట్ ఏసీ సెక్షన్‌‌ను అత్యంత విలాసవంతమైన ప్రైవేటు క్యాబిన్లుగా తీర్చిదిద్దారు. 

కోచ్ లోపలి భాగాన్ని విశాలంగా, రిచ్ లుక్‌‌తో డిజైన్ చేశారు. ఆధునిక డిజైన్, మెరుగైన పరిశుభ్రత ప్రమాణాలతో నెక్స్ట్ జనరేషన్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రయాణికుల రక్షణ కోసం కోచ్‌‌లలో నిరంతరం నిఘా ఉంచేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైలు వేగం, తదుపరి స్టేషన్ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసే డిజిటల్ స్క్రీన్స్‌‌ను సైతం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లు కేవలం పగటిపూట ప్రయాణాల కోసం చైర్ కార్ సౌకర్యంతో మాత్రమే నడుస్తున్నాయి. అయితే, సుదూరప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఈ స్లీపర్ వెర్షన్‌‌ను రూపొందించారు.