- ఫోన్ ట్యాపింగ్ లిస్టులో నంబర్ల ఆధారంగా సిట్ విచారణ
- సెక్రటేరియెట్లో రికార్డ్ చేసిన అధికారులు
- మునుగోడు, దుబ్బాక బై ఎలక్షన్లు,
- 2023 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ఫోన్ ట్యాపింగ్
- అనుమానాస్పద ఘటనలను వెల్లడించిన కార్మిక మంత్రి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. బాధితులు, సాక్షుల విచారణలో భాగంగా శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ మేరకు సెక్రటేరియెట్‌లోని చాంబర్‌లో ఆయనను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించారు. మంత్రి చెప్పిన వివరాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయాలు.. ఆయా సందర్భాల్లో చోటుచేసుకున్న అనుమానాస్పద ఘటనలకు సంబంధించి మంత్రి వివరాలు వెల్లడించినట్లు తెలిసింది.
కాగా, మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్ వెంకటస్వామి సహా విశాక ఇండస్ట్రీస్, వీ6 ఉద్యోగుల ఫోన్ నంబర్లను నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో ట్యాపింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా బేగంపేట్ సహా వ్యాపార లావాదేవీలు నిర్వహించే ప్రాంతాల్లో నాటి సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
ఉద్యోగుల జీతాలు సహా ఇతర అవసరాల కోసం బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న నగదును సీజ్ చేసేవారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందని సిట్ విచారణలో వెలుగుచూసింది. ఈ క్రమంలోనే మంత్రి వివేక్ వెంకట స్వామి సహా ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్న నంబర్ల ఆధారంగా సిట్ అధికారులుస్టేట్‌మెంట్లు రికార్డ్ చేస్తున్నారు.
