కరీంనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (జూన్ 21) ఉదయం టీజీఎస్ఆర్టీసీ కి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కు నిలపి ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. జిల్లాలోని అలుగునూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా పొగలు రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందికి దించేశాడు. అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది.
ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో.. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో కొంత దూరం తీసుకెళ్లి బస్సును డ్రైవర్ నిలపడంతో ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజిన్ తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. షాక్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
