హైడ్రాకు అన్ని పార్టీలు సమానమే..సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో అనుమానాలు: రంగనాథ్

హైడ్రాకు అన్ని పార్టీలు సమానమే..సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో  అనుమానాలు: రంగనాథ్
  • 85% భూములు అగ్రకూలాల వారి నుంచే స్వాధీనం చేసుకున్నం
  • చెరువుల్లో గుడిసెలు వేసేది పేదలు కాదు.. పెద్ద పెద్ద శక్తులే
  • హైడ్రా లేకుంటే మరో పదేండ్లలో చెరువులేవీ ఉండవన్న సంస్థ చీఫ్​
  • రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో హైడ్రాపై రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: అన్ని పార్టీలు హైడ్రాకు సమానమేనని  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ముందుగా దోపిడీని ఎదుర్కోవాల్సిన అవసరముందని, ఇందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన లక్డికాపుల్‌‌‌‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో హైడ్రాపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు.

హైడ్రాకు అందరూ సమానమేనని, ఒకరితో ఒకలా, మరొకరి విషయంలో ఇంకోలా హైడ్రా వ్యవహరించబోదన్నారు. హైడ్రాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నిజమని కొందరు నమ్ముతున్నారని, దీన్ని చూసి హైడ్రా తప్పు చేస్తుందని భావిస్తున్నారన్నారు. అందరూ ఫాతిమా కాలేజీ విషయాన్ని లేవనేత్తుతున్నారని, ఇలాంటివి చాలా స్కూల్స్, కాలేజీలు ఉన్నాయని, ఫాతిమా కాలేజీ అంశం హైకోర్టులో ఉందన్నారు. ఎంఐఎం నాయకులకు సంబంధించిన ఇండ్లను కూడా కూల్చివేశామన్నారు. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల్లో 85 శాతం అగ్రకులాలవే ఉన్నాయన్నారు. 

తప్పులు సరిచేసుకుంటూ ముందుకు..

ప్రభుత్వం హైడ్రాకు పూర్తిగా అధికారాలు, స్వేచ్ఛ ఇచ్చిందని రంగనాథ్​అన్నారు. నాలాలు, చెరువులు, భూములను కాపాడటమే హైడ్రా లక్ష్యమన్నారు. మేం తప్పు చేస్తే క్షమాపనలు కూడా చెబుతామన్నారు. హైడ్రా రాత్రికి రాత్రి ఇండ్లను కూల్చివేయదని, ముందస్తు నోటీసులు ఇస్తామని, అన్ని నిబంధనల ప్రకారమే చర్యలు ఉంటాయన్నారు. చెరువులలో గుడిసెలు వేసేది పేదలు కాదని, వారి వెనుక పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయని, దొంగ లీడర్లు కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని, హైడ్రా లాంటి సంస్థ లేకపోతే మరో పదేళ్లలో చెరువులు అనేవి ఉండవన్నారు.

హైడ్రా లాంటి సంస్థలను కాపాడుకోవాలన్నారు. హైడ్రా చాలా చేసింది, చాలా నేర్చుకుందని, తప్పులను సరిచేసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటివరకు హైడ్రా 600కు పైగా ఆపరేషన్లు నిర్వహించి 2,400 ఎకరాల భూమిని కాపాడిందని, ఈ భూముల విలువ 1.10లక్షల కోట్ల వరకు ఉంటుందన్నారు. 30 వేల ఫిర్యాదులు హైడ్రాకు వచ్చాయని, 50 మంది సిబ్బందితో అవన్ని పరిశీలించడం సాధ్యం కాదని, అందుకే ప్రజావాణి నిలిపివేసి పరిష్కరిస్తున్నామన్నారు. వచ్చే సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు. 

అపోహలు తొలగించేందుకు

కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. హైడ్రాపై ఉన్న అపోహాలను తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్దేశం మంచిది, కానీ ఆచరణలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు. విమలక్క మాట్లాడుతూ హైదరాబాద్‌‌‌‌లో ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా బాధ్యత ఏంటో స్పష్టం చేయాలన్నారు. 60, 70 అంతస్థులకు, చెరువులలో ఇండ్లు కడుతున్న వారికి అధికారులు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు.

ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ భూమాఫియాను ఎదుర్కోవడంపై మొదట హైడ్రా దృష్టిపెట్టాలన్నారు. బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సరూర్ నగర్, మీర్ పేట్, ఉప్పల్, రామంతాపూర్, హష్మత్ పేట్ చెరువులు 50ఏళ్లుగా ఆక్రమణలకు గురవుతున్నాయని, ఈ విధ్వంసానికి పాలకులే కారణన్నారు.