ర్యాగింగ్ రాక్షసానికి అంతమెప్పుడు?

ర్యాగింగ్ రాక్షసానికి అంతమెప్పుడు?

చట్టాలు  కఠినంగా  ఉన్నప్పటికీ,   ప్రతి సంవత్సరం  వివిధ ప్రాంతాల నుంచి ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి  రావడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవలే ఓ మెడికల్​ కాలేజీలోనూ ర్యాగింగ్​ జరగడం చూస్తే..  ఇంకా ఈ ర్యాగింగ్​  రాక్షసిని అరికట్ట లేకపోతున్నామా అనే నిస్పృహ కలగడం సహజం. అనేక సందర్భాల్లో ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురై చదువును మధ్యలోనే  వదిలేయడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటి  విషాద సంఘటనలు  చోటుచేసుకున్నాయి.   

సమాజానికి, విద్యా వ్యవస్థకు ప్రమాదకరం.

ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ను చిన్న విషయంగా తీసుకోవడం సమాజానికి, విద్యా వ్యవస్థకు ప్రమాదకరం.  ప్రభుత్వాలు ర్యాగింగ్ నిరోధానికి చట్టాలు తీసుకొచ్చాయి. విశ్వవిద్యాలయ మంజూరు సంఘం (యూజీసీ) కూడా అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. కళాశాలల్లో యాంటీ- ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని సూచించింది. అయినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు ఈ నిబంధనలను కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో కొన్ని ఫ్లెక్సీలు, ప్లకార్డులు ఏర్పాటు చేయడం ద్వారా  తమ బాధ్యత  పూర్తయిందని  భావించడం సరైన పద్ధతి కాదు. 

విద్యార్థుల  ప్రవర్తనపై  నిరంతర పర్యవేక్షణ ఉండాలి. హాస్టళ్లు,  క్యాంపస్‌‌‌‌‌‌‌‌లోని ఇతర ప్రాంతాల్లో అధ్యాపకుల పర్యటనలు క్రమం తప్పకుండా జరగాలి. కొత్త విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు  ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. తరచూ తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించవచ్చు. పిల్లలపై ఒత్తిడి ఉందా? ఎవరైనా వేధిస్తున్నారా? అనే విషయాలను తల్లిదండ్రులు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ప్రతి విద్యాసంస్థలో  బాధిత విద్యార్థులు భయపడకుండా ఫిర్యాదు చేయగల వాతావరణం కల్పించాలి. ఫిర్యాదు చేసిన విద్యార్థుల గోప్యతను కాపాడాలి. ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడినవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి.  హెచ్చరికలతో  సరిపెట్టకుండా  అవసరమైతే సస్పెన్షన్,  బహిష్కరణ వంటి కఠిన చర్యలు అమలు చేయాలి. శిక్షలు కచ్చితంగా అమలవుతున్నాయనే సందేశం వెళితే ఇతరులు కూడా అలాంటి చర్యలకు దూరంగా ఉంటారు. సమాజం కూడా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయరాదు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ను సామాజిక దురాచారంగా గుర్తించాలి. 

ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ప్రచారం కేవలం పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలకే పరిమితం కాకూడదు. చర్చలు, వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లు,  పరస్పర  సంభాషణలు,  మానసిక ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మాత్రమే సార్థక ఫలితాలు సాధించవచ్చు.  విద్యాసంస్థల్లో భద్రతా వాతావరణం  ప్రతి విద్యార్థి హక్కు. కళాశాలలో అడుగుపెట్టిన  ప్రతి విద్యార్థి  ఆశయాలతో ముందుకు సాగాలి.

ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ను అరికట్టేందుకు ఉక్కుపాదం అవసరం.  కఠిన చర్యలతో పాటు  మానవీయ దృక్పథం, నిరంతర పర్యవేక్షణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం, విద్యార్థుల్లో విలువల పెంపకం కలిసివస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. విద్యాలయాలు భయానికి కేంద్రాలుగా కాకుండా విజ్ఞానానికి, వ్యక్తిత్వ వికాసానికి నిలయాలుగా నిలవాలంటే ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌పై రాజీపడని వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉంది.

- తిప్పర్తి శ్రీనివాస్


Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.