తండ్రి.. నిశ్శబ్ద త్యాగానికి ప్రతిరూపం.. ఫాదర్స్ డే రోజు నాన్న త్యాగాన్ని గుర్తు చేసుకుందాం !

తండ్రి.. నిశ్శబ్ద త్యాగానికి ప్రతిరూపం.. ఫాదర్స్ డే రోజు నాన్న త్యాగాన్ని గుర్తు చేసుకుందాం !

ఈ ప్రపంచంలో   ప్రేమను ఎక్కువగా  వ్యక్తపరచేది  తల్లి అయితే,  ప్రేమను ఎక్కువగా దాచుకొని బాధ్యతల రూపంలో చూపించేది తండ్రి.  తండ్రి తన భావోద్వేగాలను  బయటపెట్టకపోయినా,  కుటుంబం కోసం చేసే ప్రతి కష్టం, ప్రతి త్యాగం, ప్రతి ఆలోచన వెనుక అపారమైన ప్రేమ దాగి ఉంటుంది. తన పిల్లల భవిష్యత్తే తన భవిష్యత్తుగా భావించి,  వారి విజయాలనే  తన  విజయాలుగా  భావిస్తూ  జీవించే వ్యక్తి తండ్రి.  ఒక వ్యక్తి తండ్రిగా మారిన క్షణం నుంచే అతని జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.   

అప్పటివరకు తన కోసం ఆలోచించిన వ్యక్తి,  ఇకపై కుటుంబం కోసం, పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆలోచించడం  ప్రారంభిస్తాడు.  పిల్లలు  జన్మించిన  రోజు నుంచి వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు, వివాహం, స్థిరమైన జీవితం వరకు ప్రతి విషయం గురించి ఆలోచిస్తూ, తన భుజాలపై బాధ్యతల భారాన్ని మోస్తాడు.  ఉద్యోగంలో  ఒత్తిడి, వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పులు, కుటుంబ అవసరాలు, సమాజంలో  గౌరవం  కాపాడుకోవడం, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలు,  ఇవన్నీ అతని మనసులో  నిరంతరం నడిచే యుద్ధాలే.  

కుటుంబం కోసం జీవితం త్యాగం

కుటుంబానికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి తండ్రి తన జీవితాన్ని అంకితం చేస్తాడు. ఇంటి అద్దె,  పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాలు,  బిల్లులు, కుటుంబ సభ్యుల అవసరాలు  ఇవన్నీ అతని సంపాదనపై ఆధారపడి ఉంటాయి.  తన వ్యక్తిగత  ఆనందాలను కుటుంబం కోసం త్యాగం చేస్తాడు. ఒకప్పుడు తాను సాధించాలని అనుకున్న లక్ష్యాలను వదిలిపెట్టి, పిల్లలు సాధించాలని కోరుకుంటాడు.   

జీవితమంతా కుటుంబం కోసం కష్టపడి, వృద్ధాప్యంలో తన పిల్లల ప్రేమ, ఆదరణ కోసం ఎదురుచూస్తాడు. చిన్నప్పుడు  చేతి పట్టుకొని నడిపించిన పిల్లలు, పెద్దయ్యాక తమ చేతిని పట్టుకుంటారని ఆశిస్తాడు.  ఒక మంచి కుటుంబానికి తండ్రి బలమైన స్తంభం.  మంచి  కుటుంబాలే మంచి సమాజాన్ని నిర్మిస్తాయి.  తండ్రిని  గౌరవించడం, ప్రేమించడం, ఆయనతో సమయం గడపడం, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం,  తండ్రి  భావాలను అర్థం చేసుకోవడం  కుటుంబం  ప్రధాన  బాధ్యత. 

- డాక్టర్. వై. సంజీవ కుమార్

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.