యాదాద్రికి పెరుగుతున్న వలసలు....జిల్లాలో లక్ష దాటిన వలస కార్మికులు

యాదాద్రికి పెరుగుతున్న వలసలు....జిల్లాలో లక్ష దాటిన వలస కార్మికులు
  •     ఇండ్ల గణనలో తేలిన వివరాలు
  •     వలసొచ్చినోళ్ల తాత్కాలిక నివాసాలే 40 వేలు
  •     జిల్లాలో 3.05 లక్షల ఇండ్లు.. 8.60 లక్షలకు చేరిన జనాభా
  •     ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన 25 వేల స్థానిక కుటుంబాలు

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి భువనగిరి జిల్లా వలస కార్మికులకు ప్రధాన కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్​సహా పలు రాష్ట్రాల నుంచి వలస వచ్చే కార్మికులతో జిల్లా కిక్కిరిసిపోతోంది. జిల్లా మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులు, రెండు రైల్వే లైన్లు రవాణా పరంగా వీరికి ఎంతో అనుకూలంగా మారాయి. స్థానిక ప్రజలు కూలీ పనుల పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, ఇక్కడి కంపెనీలు, రైస్​ మిల్లులు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగం, హమాలీ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను రప్పించుకుంటున్నారు. తాజాగా ముగిసిన ఇండ్ల గణన వివరాల ప్రకారం జిల్లాలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల సంఖ్య లక్ష దాటినట్లు స్పష్టమవుతోంది.

జిల్లాలో పెరిగిన ఇండ్లు, జనాభా ఇలా..

దేశవ్యాప్తంగా 2011లో 16వ జనగణన జరిగింది. ప్రతీ పదేండ్లకు ఒకసారి జనగణన జరగాల్సి ఉంది. కానీ 2021లో జరగాల్సి ఉన్న జనగణన కరోనా కారణంగా నిర్వహించలేదు. 2011లో నిర్వహించిన లెక్కల ప్రకారం..  యాదాద్రి జిల్లాలో 1,88,520  ఇండ్లు ఉన్నాయి. జనాభా 7,70,833 ఉండగా,  ఇందులో పురుషులు 3,90,492, మహిళలు 3,80,341 ఉన్నారు. 2024లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం..  జిల్లాలో 2,60,766 ఇండ్లు ఉండగా, 8, 04,002 జనాభా ఉంది. 2027 జనగణనలో భాగంగా నిర్వహించే 17వ జనగణనలో తొలుత ఇండ్ల గణన నిర్వహించారు. 

ఈ ఏడాది ఏప్రిల్​​26న ప్రారంభమైన ఇండ్ల గణన జూన్​ 5న ముగిసింది. ఇండ్లను లెక్కించడంతో పాటు కుటుంబాలు, సభ్యుల లెక్కలు నమోదు చేసుకున్న ఎన్యూమరేటర్లు ఈ నెల 9న హయ్యర్​ ఆఫీసర్లకు వివరాలు అందించారు. ఈ గణనలో ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్​, ఒడిశా, బిహార్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి, కంపెనీల పరిసరాల్లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసాలను, జనాల సంఖ్యను నమోదు చేశారు. ఒకే కంపౌడ్​ వాల్​ లోపల ఉన్న వారిని ఒకే ఫ్యామిలీగా పరిగణించి, మెంబర్స్​ను మాత్రం విడిగా లెక్కలు వేశారు. దీంతో యాదాద్రి జిల్లాలో ఇండ్ల సంఖ్య 3.05 లక్షలకు, జనాభా 8.60 లక్షలకు చేరింది.  

40 వేల ఇండ్లకు పైగా ఖాళీ.. వలసొచ్చినోళ్ల ఇండ్లు 40 వేలు.. !

యాదాద్రి జిల్లాకు చెందిన సుమారు 25 వేల స్థానిక కుటుంబాలు ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తాజా  గణన ద్వారా వెల్లడైంది. వీరంతా ప్రస్తుతం తాము నివసిస్తున్న ప్రాంతాల్లోనే పేర్లను నమోదు చేసుకోవడంతో జిల్లాలో జరిగిన ఇండ్ల గణనలో పాల్గొనలేదు. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేలకు పైగా ఇండ్లు ఎవరూ లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయని ఎన్యూమరేటర్లు తమ నివేదికలో పేర్కొన్నారు. జిల్లా నుంచి సుమారు 70 వేల మంది స్థానికులు ఇతర ప్రాంతాల గణనలో భాగస్వాములయ్యారు. 

అలాగే 2024 సర్వే నుంచి తాజా ఇండ్ల గణన నాటికి జిల్లాలో అదనంగా 40 వేలకు పైగా ఇండ్లు పెరగడం, జనాభా మరో 54 వేల వరకు వృద్ధి చెందడం గమనార్హం. పెరిగిన ఈ ఇండ్లు, జనాభా అంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులదేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా,  కంపెనీలు ఎక్కువగా ఉన్న చౌటుప్పల్​ పరిధిలోనే దాదాపు 30 వేల మందికి పైగా వలవచ్చినవారు ఉంటున్నారు. ఆ తర్వాత భువనగిరి, బొమ్మల రామారం, ఆలేరు సహా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.