- 16 నెలలుగా స్పందించని ఆఫీసర్లు
- నిబంధనలు అతిక్రమించి చెల్లింపులు
- రికవరీకి ఆడిట్శాఖ చర్యలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు చెప్పేందుకు అధికారులు మొండికేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏటా ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వాటికి సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12.43 కోట్ల నిధుల వినియోగానికి సరైన లెక్కలు, పత్రాలు లేవని ఆడిట్ తనిఖీల్లో వెల్లడైంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా విడుదల చేస్తున్న నిధులతో పాటు పన్నుల రూపంలో మున్సిపాలిటీ ఖజానాకు చేరుతున్న ఆదాయాన్ని ఎలా ఖర్చు చేశారనే విషయంపై సరైన లెక్కలు చూపకపోవడంపై పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆడిట్ నివేదిక వెలువడి 16 నెలలు గడుస్తున్నా అభ్యంతరాలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
అక్రమాలపై చూసీచూడనట్లు..
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అనుమతులకు మించి కడుతున్న మొత్తం 1,098 నిర్మాణాలను గుర్తించి రూ.3.90 లక్షల మేర పెనాల్టీలు విధించినట్లు ఆడిట్ తనిఖీల్లో వెల్లడైంది. మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద నివారణకు చేపట్టిన చర్యలపైనా ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరైన ఆధారాలు లేకుండానే రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు గుర్తించారు.
శానిటేషన్ కిట్లను టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అందించినట్లు, చెత్త సేకరణకు వినియోగిస్తున్న 11 వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు లేకుండానే నిర్వహణ కొనసాగిస్తున్నట్లు ఆడిట్ లో తేలింది. దీంతో డీజిల్ ఖర్చుల పేరుతో అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్టేషనరీ, వీధిదీపాలకు చేసిన ఖర్చులకు సంబంధించిన లెక్కలు, పత్రాలు కూడా సక్రమంగా చూపించలేదని, వివిధ పనులకు సంబంధించి వసూలు చేసిన జీఎస్టీ, సీనరేజ్, డీఎంఎఫ్‌టీ మొత్తాలను సంబంధిత శాఖలకు జమ చేయలేదని కూడా గుర్తించారు.
పన్నుల వసూళ్లపై పట్టింపేది?
మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యంతో పాటు సింగరేణి నుంచి రూ.85.68 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు ఆడిట్ నివేదికలో వెల్లడైంది. రూ.75 లక్షల వరకు నీటి పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
మున్సిపాలిటీ పరిధిలో 1,282 ట్రేడ్ లైసెన్సులు ఉండగా, కేవలం 448 లైసెన్సుల నుంచే పన్నులు వసూలు చేస్తున్నట్లు ఆడిట్‌లో తేలింది. మిగిలిన 834 దుకాణాల నుంచి పన్నులు వసూలు చేయకపోవడంతో మున్సిపాలిటీ భారీగా ఆదాయాన్ని కోల్పోతోందని పేర్కొన్నారు. పట్టణవాసుల నుంచి వసూలు చేసిన రూ.7.19 లక్షల ఆస్తిపన్నును సిబ్బంది ప్రభుత్వ ఖజానాకు ఆలస్యంగా జమ చేసినట్లు కూడా ఆడిట్ అధికారులు గుర్తించారు.
ఆడిట్‌లో 559 అభ్యంతరాలు..
భూపాలపల్లి మున్సిపాలిటీలో 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ.91.38 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపించారు. ఇందులో రూ.12.43 కోట్ల నిధులకు సంబంధించిన పత్రాలను చూపలేదని ఆడిట్ తనిఖీల్లో తేలింది.
మున్సిపాలిటీగా ఏర్పడిన 2014-15 నుంచి 2024-25 వరకు మొత్తం రూ.206.33 కోట్ల నిధుల వినియోగంపై తనిఖీల్లో 559 అభ్యంతరాలు వ్యక్తమైనట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. నిధుల వినియోగానికి సంబంధించి సరైన పత్రాలు సమర్పించకపోతే సంబంధిత మొత్తాలను రికవరీ చేసేందుకు ఆడిట్ శాఖ సిద్ధమైంది.
రెండు నెలల్లో సమాధానం ఇవ్వాలి..
మున్సిపాలిటీ నిధుల వినియోగానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నవాటిపై సమాధానాలు సమర్పించాలని రిపోర్టుతో పాటు స్పెషల్ లెటర్స్ అందజేశాం. ఉన్నాతాధికారులకు అభ్యంతరాల నివేదికను పంపుతాం. అభ్యంతరాలపై సంబంధిత ఆఫీసర్లకు సమాధానం ఇవ్వడానికి రెండు నెలల సమయం ఇచ్చాం.
ఎస్.మానస, జిల్లా ఆడిట్ ఆఫీసర్, భూపాలపల్లి
