చాదర్ఘాట్ వరకు ఏనుగు ట్రయల్ వాక్...మొహర్రం వేడుకల్లో భాగంగా ప్రారంభించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

చాదర్ఘాట్ వరకు ఏనుగు ట్రయల్ వాక్...మొహర్రం వేడుకల్లో భాగంగా ప్రారంభించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్
  •     దాదాపు 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి

చార్మినార్,  వెలుగు: మొహర్రం వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చారిత్రక డబీర్​పురా బీబీ కా అలవాలో సీపీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా నిలిచే శ్రీదేవి అనే ఏనుగు ట్రయల్ వాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్ ఎఫెండితో కలిసి ప్రారంభించారు. భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మొహర్రం సందర్భంగా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. +

ఇందులో భాగంగా మొహర్రం ఊరేగింపు కోసం దాదాపు 2 వేల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. భారీ జన సమూహం ఉన్నప్పుడు ఏనుగు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఊరేగింపు సాగే మార్గం ఎలా ఉందనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడమే ఈ ట్రయల్ రన్ ఉద్దేశమని, చాదర్​ఘాట్​వరకు నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ట్రాఫిక్​డీసీపీ రాహుల్ హెగ్డే, మీర్ చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్, బీజేపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బక్రీ, మార్కజీ మాతమి అధ్యక్షుడు నజఫ్ అలీ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.