బుగ్గపాడు ఫుడ్ పార్క్‌‌‌‌‌‌‌‌..భూ కేటాయింపులపై రచ్చ!

బుగ్గపాడు ఫుడ్ పార్క్‌‌‌‌‌‌‌‌..భూ కేటాయింపులపై రచ్చ!
  •  అగ్గువకే ప్రైవేట్​ కంపెనీకి భూములు కట్టబెట్టారని ఆరోపణలు
  • రూ.25 లక్షలకు ఎకరా కేటాయించడంపై వివాదం
  • భారీ అవినీతి జరిగిందంటున్న బీజేపీ
  • లీజుకు తీసుకొని రూ.కోటి కరెంటు బిల్లు ఎగ్గొట్టిన ప్రాసెసింగ్​ కంపెనీ

ఖమ్మం జిల్లా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌‌‌‌‌‌‌‌లో భూ కేటాయింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఒకవైపు మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీ రూ.కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు పెట్టి కనుమరుగవగా, మరోవైపు ఏపీకి చెందిన కంపెనీకి మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు 72 ఎకరాల భూమి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ కేటాయింపుల్లో పారదర్శకత లేదని బీజేపీ ఆరోపిస్తోంది. అవినీతి, అక్రమాలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మాత్రం అన్ని కేటాయింపులు చట్టబద్ధంగానే జరిగాయని చెబుతున్నారు.

ఖమ్మం/ సత్తుపల్లి, వెలుగు: స్థానికులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సత్తుపల్లికి సమీపంలోని బుగ్గపాడులో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ లో భూ కేటాయింపు అంశం వివాదాస్పదంగా మారింది. భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తుండగా, ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. 

2008లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ఈ ఫుడ్​ పార్క్​ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. రూ.2 లక్షల్లోపు పరిహారం చెల్లించి రైతుల నుంచి 203 ఎకరాలను సేకరించారు. 2016లో అప్పటి మంత్రులు కేటీఆర్​, తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రూ.109.44 కోట్లతో ఫుడ్ పార్క్​లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

60 ఎకరాల్లో డెవలప్​మెంట్ చేపట్టి కోల్డ్ స్టోరేజీలు, వేర్​హౌస్​లు, ప్యాకింగ్ గోడౌన్లు, సెంట్రల్ లైటింగ్, రైపెనింగ్ చాంబర్లు, గ్రేడింగ్ చాంబర్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. మిగిలిన భూములను కంపెనీలకు కేటాయించాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి అభివృద్ధి కార్యక్రమాల తర్వాత ఎట్టకేలకు 2024 డిసెంబర్​ 6న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్​ బాబు చేతులమీదుగా ఫుడ్ పార్క్​ ను ప్రారంభించారు. 

ఎకరా రూ.50 లక్షలు తక్కువ రేటుకు..

గత మూడు, నాలుగేళ్లుగా ఒకట్రెండు పరిశ్రమలు నడుస్తుండగా, అందులో ఒక కంపెనీ ఇంతకు ముందే బంద్​ అయింది. గతేడాది వరకు మామిడి ప్రాసెసింగ్ చేసిన మరో కంపెనీ ఈ సీజన్​ లో మాత్రం అసలు కనిపించలేదు. కంపెనీ ప్రతినిధులు లేకపోవడం, హెచ్​టీ లైన్​ కరెంట్ పెండింగ్ బిల్లులు రూ.కోటి దాటడంతో నష్టాలతో ముఖం చాటేశారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా కొన్ని వారాల క్రితం ఏపీకి చెందిన దీపక్ నెక్స్​ జెన్​ కంపెనీకి మెగా ఫుడ్ పార్క్​లో ఎకరానికి రూ.25 లక్షల చొప్పున 72 ఎకరాలు కేటాయించారు. 

ఈ భూమిని ఆనుకొని ఉన్న ఎకరా భూమిని అదే కంపెనీ రూ.75 లక్షల చొప్పున ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది.  రెండేళ్లలో సదరు కంపెనీ పరిశ్రమ ఏర్పాటుతో పాటు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తే రెండేళ్ల తర్వాత అవే 72 ఎకరాల భూములు ఆ కంపెనీ పేరుతో సేల్ డీడ్​ రిజిస్ట్రేషన్​ అవుతుందని ఎంఓయూ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. 

ప్రైవేట్​ వ్యక్తుల వద్ద రూ.75 లక్షలకు కొన్న భూమిని, ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలకు కంపెనీకి విక్రయించడంపై బీజేపీ విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది. బీజేపీ ఆరోపణలు, విమర్శలకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి స్పందించారు. చట్ట ప్రకారమే కేటాయింపులు జరిగాయని శనివారం సత్తుపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. 

రెండు సార్లు నోటీసులు ఇచ్చాం

ఫుడ్​ పార్క్​లో ఎల్లో అండ్​ గ్రీన్​ ప్రాసెసింగ్ కంపెనీ గత మూడేళ్లుగా మ్యాంగో పల్ప్ ప్రాసెసింగ్ చేస్తోంది. హెచ్​టీ లైన్​ కనెక్షన్​ తీసుకోగా ప్రస్తుతం రూ.కోటి 3 లక్షల 23 వేల బకాయి ఉంది. బిల్లు కట్టాలని ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చాం. గడువులోగా స్పందించకపోతే చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆ కంపెనీ ఆస్తులను సీజ్​ చేసే అధికారం కూడా మాకుంది. 

– ప్రసాద్, విద్యుత్ శాఖ ఏడీఈ, సత్తుపల్లి–