వెలుగు ఓపెన్ పేజీ.. సామాజిక న్యాయ తెలంగాణ పొద్దు

వెలుగు ఓపెన్ పేజీ.. సామాజిక న్యాయ తెలంగాణ పొద్దు

సామాజిక న్యాయ తెలంగాణ పొద్దు పొడిచింది.  నేడు సరూర్​నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ  రక్షణ సేన  చీఫ్  కల్వకుంట్ల కవిత సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప శంఖం పూరిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ పోరాటం తన లక్ష్యాన్ని సాధించి చరిత్ర గతినే మార్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది సామాజిక న్యాయ తెలంగాణ. ఈ ఉద్యమం కూడా తన లక్ష్యాన్ని ముద్దాడి భవిష్యత్ భారతానికి మార్గదర్శనం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం ద్వారా మనం సాధించిన లక్ష్యం ఒక మైలురాయి మాత్రమే. సర్వోదయ తెలంగాణలో భాగంగా మన అసలు సిసలైన గమ్యం సామాజిక తెలంగాణ సాధించటమే.  సామాజిక తెలంగాణ సాధించిననాడే మనం తెచ్చుకున్న తెలంగాణకు పరిపూర్ణ లక్ష్యం  సాధించినవాళ్లమవుతాం. 

నేడు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

ఈ సామాజిక తెలంగాణ ఉద్యమంలో మన వాళ్లతోనే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి. అందుకే గత పోరాటాలతో పోల్చుకుంటే ఈ ఉద్యమం సవాలుతో కూడినది.  తెలంగాణ సాధించిన తర్వాత పునర్నిర్మాణం పేరుతో సామాజిక న్యాయం చేస్తారనే అంతా భావించారు. కానీ సంక్షేమం, అభివృద్ధి అనే పేరుతో అదే తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పే ప్రయత్నం చేశారు. సంక్షేమం, అభివృద్ధి అనేది పునర్నిర్మాణ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. 

తమకు ఏం కావాలో  తేల్చుకునేవిధంగా నిర్ణయాల్లో అన్ని వర్గాలు భాగస్వామ్యం అయినప్పుడే అది నిజమైన తెలంగాణ పునర్నిర్మాణం అవుతుంది. అలాంటి మహత్తర లక్ష్యం కోసం ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ పార్టీ మాట్లాడటం కానీ ముందుకు రావటం కానీ చేస్తుండకపోవడం దురదృష్టకరం.  ప్రొఫెసర్  జయశంకర్ సార్  మార్గదర్శనంలో  ఉద్యమ పోరాటంలో పాలుపంచుకున్న కవిత ఆయన  కలలు కన్న సామాజిక న్యాయ తెలంగాణ సాధనే పరిపూర్ణ తెలంగాణ సాధన అని భావిస్తున్నారు.  

అందుకే కవిత ఈ బృహత్తర సంకల్పానికి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. తన లక్ష్య సాధనలో భాగంగానే  నేడు  సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈ సభ కచ్చితంగా తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేసే సభ కానుంది. సామాజిక న్యాయ తెలంగాణ రోడ్ మ్యాప్ ను ఈ సభ ద్వారా కవిత వివరించనున్నారు. 

సామాజిక న్యాయంకోసం పోరాటం

తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ పేరుతో ఆమె చేసిన పోరాటం సాధారణమైనది కాదు. మొత్తం తెలంగాణ మహిళా సమాజాన్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు పెద్ద సాంస్కృతిక ఉద్యమమే చేశారు. బతుకమ్మ, బోనాల పండుగ విశిష్టతలను ఉద్యమంలో మిళితం చేసిన విధానం ఆమె పోరాట పటిమకు నిదర్శనం. లక్ష్య సాధనలో అచంచలమైన చిత్తశుద్ది ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. 

ఆనాటి పోరాటంలో సొంతవాళ్లనుంచే తనకు అడుగడుగునా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ తన లక్ష్యం కోసం ఆమె వాటిని లెక్క చేయలేదు.  ఇవ్వాళ తానే సామాజిక న్యాయ తెలంగాణ ఉద్యమానికి రథసారథిగా ఉన్నారు.  తాను కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ఐదు కీలక అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకుంటే అందులో సామాజిక తెలంగాణ అనేది కీలకంగా ఉండేలా చూసుకున్నారు. 

అంతేకాకుండా తన పార్టీ పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మార్గదర్శనంగా ముందుకు కదులుతున్నారు.   తెలంగాణ రక్షణ సేన ప్రారంభించటానికి ముందు నుంచే జాగృతి సంస్థ ద్వారా సామాజిక న్యాయం పోరాటాన్ని కొనసాగించారు. ఎంతోమంది మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. కామారెడ్డిలో రైల్ రోకో కూడా నిర్వహించారు. 

తన పోరాటాల ద్వారా ఇవ్వాళ తెలంగాణలో అన్ని పార్టీలు తప్పనిసరిగా సామాజిక న్యాయం అనక తప్పని పరిస్థితిని తెచ్చారు.  ఇవ్వాళ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కచ్చితంగా ఈ పోరాటంలో ఒక మైలురాయి కానుంది. 

- కామెర నవీన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.