- ఏకంగా 37.50 శాతం కోట్ చేసిన అదానీ కంపెనీ
- చత్తీస్‌గఢ్‌లో293 మిలియన్ టన్నుల
- నాణ్యమైన బొగ్గు గని దేశంలో ఈ దఫా
- ఆరు బొగ్గు గనులకు వేలం పూర్తి
హైదరాబాద్, వెలుగు: చత్తీస్గఢ్రాష్ట్రంలోని తార బొగ్గు బ్లాక్ ను అదానీ గ్రూప్కైవసం చేసుకుంది. 293 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు రకం గల ఈ బ్లాక్ కు కేంద్రం నిర్వహించిన వేలంలో సింగరేణి సహా దేశంలోని 8 బడా కంపెనీలు పోటీ పడ్డాయి. చివరకు అదానీ గ్రూప్‌నకు చెందిన ‘సీజీ సిన్ గ్యాస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ కంపెనీ అత్యధికంగా 37.50 శాతం రాయల్టీ ఫీజు కోట్ చేసి బొగ్గు బ్లాక్‌ను కైవసం చేసుకుంది. కేంద్రం ఈ దఫా దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని ఆరు కోల్ బ్లాకుల వేలం నిర్వహించింది. ఇందులో మూడు ప్రైవేట్ కంపెనీలు దక్కించుకోగా మరో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కైవసం చేసుకున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ బుధవారం ప్రకటించింది.
ఆరు బొగ్గు బ్లాకులు వేలం
తెలంగాణ, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 6 కోల్ బ్లాక్‌లకు ఆగస్టు 3, 4 తేదీల్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ వేలం నిర్వహించింది. సుమారు 1,503.93 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న బ్లాక్‌లు ఇవి. కేంద్రం మధ్యప్రదేశ్‌లోని డొంగేరితల్–2 బ్లాక్‌కు 5 శాతం రాయల్టీ ఫీజు (రిజర్వ్ ప్రైస్) నిర్ణయించగా, మిగతా ఐదు బ్లాక్‌లకు కేవలం 4 శాతం నామ మాత్రపు ఫీజును ఖరారు చేసింది. వీటిలో రాష్ట్రంలోని మణుగూరు పీకేఓసీ డిప్‌సైడ్ కోల్ బ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి 6.5 శాతం కోట్ చేసి దక్కించుకున్నది. జార్ఖండ్ రాష్ట్రంలోని మార్గో ఈస్ట్ ను 10.25 శాతం, మార్గో వెస్ట్ కోల్ బ్లాక్‌ను 6.5 శాతం కోట్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ జార్ఖండ్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కైవసరం చేసుకున్నది. మధ్యప్రదేశ్‌లోని డొంగేరితల్–2 బ్లాక్‌ను 6.5 శాతంతో గ్యాలంట్ ఇస్పాట్ లిమిటెడ్, మండ్యాల సౌత్ బ్లాక్‌ను 4.5 శాతంతో క్యూబ్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ సంస్థలు దక్కించుకున్నాయి.
తార బొగ్గు బ్లాక్ కోసం భారీ పోటీ
చత్తీస్‌గఢ్‌లోని తార కోల్ బ్లాక్ కోసం దేశంలోని బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ కోల్ బ్లాక్‌లో సుమారు 293 మిలియన్ టన్నుల జీ2 నుంచి జీ 9 వరకు కోల్ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నాయి. నాణ్యమైన బొగ్గు తవ్వి తీసి విక్రయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణితో పాటు రిలయన్స్, జిందాల్, అదానీ, ఏఎమ్మార్ వంటి ఎనిమిది కంపెనీలు పోటీ పడ్డాయి. చివరకు వేలంలో 37.5 శాతం కోట్ చేసిన అదానీ గ్రూప్ కు చెందిన సీజీ సిన్ గ్యాస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ బొగ్గు బ్లాక్ దక్కినట్టు కేంద్రం ప్రకటించింది.
147 బొగ్గు బ్లాక్‌ల వేలం
2020 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 147 బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేసినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రకటించింది. ‘వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 377.97 మిలియన్ టన్నులు. ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే, దేశానికి ఏడాదికి రూ.48 వేల215 కోట్ల రాబడి వస్తుంది. అటు బొగ్గు గనులున్న ప్రాంతాల్లో రూ.54 వేల 315 కోట్ల మూలధన పెట్టుబడులు, 4,89,552 ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి’ అని కేంద్రం స్పష్టం చేసింది.
